మోదీపై నార్వే పత్రిక వివాదాస్పద కార్టూన్.. జాతి వివక్ష అంటూ సోషల్ మీడియా ఆగ్రహం!
మోదీపై నార్వే పత్రిక వివాదాస్పద కార్టూన్.. జాతి వివక్ష అంటూ సోషల్ మీడియా ఆగ్రహం!
మోదీ


న్యూఢిల్లీ 20 మే (హి.స.)ప్రధాని నరేంద్ర మోదీ నార్వే పర్యటన సందర్భంగా ఓ ప్రముఖ నార్వేజియన్ పత్రిక ప్రచురించిన కార్టూన్ తీవ్ర వివాదాస్పదంగా మారింది. మోదీని పాములు ఆడించే వ్యక్తిగా (స్నేక్ చార్మర్) చిత్రీకరిస్తూ ప్రచురించిన ఈ కార్టూన్పై భారతీయుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇది పాశ్చాత్య దేశాల పాతకాలపు వలసవాద, జాతి వివక్ష ధోరణులకు అద్దం పడుతోందని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నార్వేకు చెందిన 'ఆఫ్టెన్పోస్టెన్' అనే వార్తాపత్రిక A clever and slightly annoying man (తెలివైన, కొద్దిగా చికాకు కలిగించే వ్యక్తి) శీర్షికతో ప్రచురించిన ఒక కథనానికి అనుబంధంగా ఈ కార్టూన్ను ప్రచురించింది. ఇందులో మోదీ చేతిలో పాముకు బదులుగా ఫ్యూయల్ స్టేషన్ పైపును పట్టుకుని ఊదుతున్నట్టుగా చిత్రీకరించారు. ఈ కార్టూన్ పాతకాలపు భారత వ్యతిరేక మూసధోరణులను ప్రతిబింబిస్తోందని, ఇది భారత్ను, దేశ ప్రధానిని అవమానించడమేనని నెటిజన్లు మండిపడుతున్నారు.

ఇదే పర్యటనలో ప్రధాని మోదీ మీడియా నుంచి ప్రశ్నలు ఎందుకు స్వీకరించడం లేదని నార్వే జర్నలిస్ట్ హెల్లే లింగ్ బహిరంగంగా ప్రశ్నించిన ఘటన తర్వాత ఈ కార్టూన్ వివాదం మరింత ముదిరింది. నార్వే ప్రధానితో కలిసి సంయుక్తంగా పాల్గొన్న కార్యక్రమంలో ఆమె ఈ ప్రశ్న లేవనెత్తగా మోదీ స్పందించలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.

ఈ రెండు పరిణామాలపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. విదేశాంగ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ మాట్లాడుతూ భారత్లోని ప్రజాస్వామ్య స్ఫూర్తిని అర్థం చేసుకోకుండా కొందరు విమర్శలు చేస్తున్నారని అన్నారు. భారత్ విస్తృతి, సంక్లిష్టత గురించి తెలియకుండా, ఏవో కొన్ని అజ్ఞాన ఎన్జీవోలు ఇచ్చే నివేదికలు చదివి ప్రశ్నలు అడుగుతున్నారు అని ఆయన ఘాటుగా బదులిచ్చారు. ఒక్క ఢిల్లీలోనే 200 టీవీ ఛానెళ్లు ఉన్నాయని, ఇక్కడ వాక్ స్వాతంత్ర్యం ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆయన వివరించారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కులను కల్పిస్తుందని, వాటికి భంగం కలిగితే న్యాయపరమైన రక్షణ కూడా ఉందని ఆయన స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande