
తిరుపతి, 20 మే (హి.స.)
తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “మొబైల్ రికవరీ మేళా”లో 14వ దశలో భాగంగా సుమారు రూ.1 కోటి విలువైన 500 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన CEIR (Central Equipment Identity Register) పోర్టల్ ద్వారా ఈ ఫోన్లను ట్రాక్ చేసి తిరిగి అప్పగించినట్లు జిల్లా ఎస్పీ యల్. సుబ్బరాయుడు తెలిపారు.
తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ, ఇప్పటివరకు నిర్వహించిన 13 దశల్లో మొత్తం రూ.10.52 కోట్ల విలువైన 4,785 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు వెల్లడించారు.ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో కీలక భాగంగా మారిందని, ఫోన్ పోగొట్టుకున్నప్పుడు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా ఇంటి నుంచే CEIR సేవల ద్వారా ఫిర్యాదు నమోదు చేసుకునే విధంగా సౌకర్యం కల్పించామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాల నుండి కూడా మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసి రికవరీ చేసినట్లు తెలిపారు. CEIR సేవల కోసం 9490617873 వాట్సాప్ నంబర్కు “Hi” అని మెసేజ్ పంపితే ఫిర్యాదు నమోదు లింక్తో పాటు పూర్తి సాంకేతిక సహాయం అందిస్తామని చెప్పారు. మొబైల్ పోగొట్టుకున్న వెంటనే CEIR పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయాలని, సిమ్ కార్డును బ్లాక్ చేయించుకోవాలని, PhonePe, Google Pay, Paytm వంటి యాప్లకు బలమైన పాస్వర్డ్లు ఉపయోగించాలని ఎస్పీ సూచించారు. అపరిచితుల వద్ద నుండి మొబైల్ ఫోన్లు కొనుగోలు చేయవద్దని హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV