కౌంటింగ్కు ముందు మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
కౌంటింగ్కు ముందు మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
Mamata banerjee


కలకత్తా , 04 మే (హి.స.)

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు కొన్ని గంటల ముందు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్ల వద్ద ఉద్దేశపూర్వకంగా విద్యుత్ కోతలు విధిస్తున్నారని, సీసీటీవీలను ఆఫ్ చేస్తున్నారని ఆరోపించారు. సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో 'ఎక్స్' వేదికగా ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా కలకలం రేపింది.

వివిధ ప్రాంతాల్లో కావాలనే లోడ్ షెడ్డింగ్ చేస్తున్నట్లు నాకు సమాచారం అందుతోంది. హూగ్లీలోని సెరాంపూర్, నాడియాలోని కృష్ణానగర్, బర్ద్వాన్లోని ఆష్గ్రామ్, కోల్కతాలోని ఖుదీరామ్ అనుశీలన్ కేంద్రం వద్ద ఇలాంటి ఘటనలు జరిగాయి. సీసీటీవీలు ఆఫ్ చేస్తున్నారు, స్ట్రాంగ్రూమ్ల వద్దకు వాహనాలు వస్తూ పోతున్నాయి అని మమత తన పోస్టులో పేర్కొన్నారు. ఈ కుట్రల వెనుక బీజేపీ హస్తం ఉందని ఆమె ఆరోపించారు.

నేను రాత్రంతా మేల్కొని పరిస్థితిని గమనిస్తున్నట్లే, మీరు కూడా రాత్రంతా మేల్కొని స్ట్రాంగ్రూమ్ల వద్ద ప్రజా తీర్పును కాపాడాలి. ఎక్కడైనా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తే వారిని చుట్టుముట్టండి, వెంటనే ఫిర్యాదు చేయండి, సీసీటీవీ ఫుటేజ్ డిమాండ్ చేయండి అని తన పార్టీ కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు. నాలుగోసారి అధికారం కోసం పోటీ పడుతున్న మమత, ఆదివారం సాయంత్రం భవానీపూర్ నియోజకవర్గ కౌంటింగ్ ఏజెంట్లతో సమావేశమయ్యారు.

బెంగాల్లోని 294 అసెంబ్లీ స్థానాలకు గాను మెజారిటీకి 148 సీట్లు అవసరం. ఈ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. అయితే, ఐదు ఎగ్జిట్ పోల్స్ బీజేపీ విజయం సాధిస్తుందని అంచనా వేయగా, తాము 226కు పైగా సీట్లు గెలుస్తామని మమత ధీమా వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande