
ఢిల్లీ, 04 మే (హి.స.)
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లెక్కింపు ఉత్కంఠగా సాగుతున్న సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ఎక్స్' వేదికగా చేసిన ఓ పోస్ట్ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. నైపుణ్యం, కృషి, కరుణ వంటి మానవ విలువల ప్రాధాన్యాన్ని వివరిస్తూ ఆయన చేసిన ఈ ట్వీట్పై భిన్నమైన వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
నైపుణ్యం, శ్రద్ధ, కరుణ అనేవి మన జీవితంలోని అద్భుతమైన శక్తులు. వాటితో మనం ప్రతి సవాలును అధిగమించడమే కాకుండా, మన లక్ష్యాలను కూడా సాధించగలం అని ప్రధాని తన పోస్ట్లో పేర్కొన్నారు. సమర్థునికి భారం ఏముంటుంది? శ్రమించేవారికి దూరం అనేది ఉంటుందా? బాగా చదువుకున్నవారికి అపరిచిత ప్రదేశం అంటూ ఏదీ ఉండదు అని ఆయన వ్యాఖ్యానించారు.
ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న కీలక తరుణంలో ప్రధాని ఈ విధమైన తాత్విక సందేశం ఇవ్వడంపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. ఇది కేవలం స్ఫూర్తిదాయక సందేశమని కొందరు అంటుండగా, మరికొందరు దీని వెనుక రాజకీయ సంకేతాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ మూడు రాష్ట్రాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తున్న నేపథ్యంలో, పార్టీ కార్యకర్తల కృషిని (శ్రద్ధ) ఉద్దేశించే ప్రధాని ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi