
నాగ్పూర్, 16 జూన్ (హి.స.)
మహారాష్ట్రలోని నాగ్పూర్లో అత్యంత ఘోరమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. భారతీయ వైమానిక దళ (IAF) అధికారి భార్య అయిన 24 ఏళ్ల యువతిపై.. పాత స్కూల్ స్నేహితుడు, అతడి అనుచరులు కలిసి కూల్డ్రింక్లో డ్రగ్స్ కలిపి ఇచ్చి అత్యాచారానికి ఒడిగట్టారు. అంతటితో ఆగకుండా రహస్య వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తూ, లక్షల రూపాయలు వసూలు చేసి, చివరికి బలవంతంగా మతమార్పిడి, నిఖా (పెళ్లి) చేయించిన ఆరోపణలపై ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడైన మౌలానా కోసం గాలిస్తున్నారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే బాధితురాలు.. భూమి లావాదేవీల విషయమై ఫిబ్రవరి 2025లో తన పాత స్కూల్ పరిచయస్తుడు అయ్యాజ్ తాజ్ మదారేను కలిసింది. పోలీసుల కథనం ప్రకారం.. ఫిబ్రవరి 8న ఒక హోటల్ సమావేశంలో అయ్యాజ్ ఆమెకు ఇచ్చిన పానీయంలో మత్తుమందు కలిపి అత్యాచారం చేశాడు. ఆ దృశ్యాలను రహస్యంగా రికార్డ్ చేసి, వాటిని సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తూ గత కొన్ని నెలలుగా ఆమె నుంచి దాదాపు రూ. 4 లక్షలు వసూలు చేశాడు. అంతేకాకుండా, చేతబడి (బ్లాక్ మ్యాజిక్) చేస్తామంటూ పలుమార్లు బెదిరింపులకు గురిచేశారు.
మే 31న నిందితుడు అయ్యాజ్, అతడి అనుచరుడు అమీన్ షేక్ కలిసి ఆ యువతిని కల్మేశ్వర్ ప్రాంతానికి బలవంతంగా తీసుకెళ్లారు. అక్కడ హజ్రత్ మౌలానా అనే మత పెద్ద ఆమె చేత బలవంతంగా మతమార్పిడి ఆచారాలు చేయించి, ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా అయ్యాజ్తో నిఖా జరిపించినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. నగరం వెలుపల విధులు నిర్వహిస్తున్న ఆమె భర్త (IAF అధికారి) ఈ ఘోరం గురించి తెలుసుకుని, జూన్ 14న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నాగ్పూర్ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi