
న్యూఢిల్లీ, 16 జూన్ (హి.స.)
దేశంలో సిరప్ ఆధారిత ఔషధాల విక్రయాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దగ్గు మందు (Cough Syrups) వంటి సిరప్లను కెమిస్ట్లు నేరుగా వినియోగదారులకు విక్రయించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. దగ్గు మందు కొనుగోలు చేయాలంటే డాక్టర్ చీటీ తప్పనిసరి చేసింది. ఈ మేరకు 1945 ఔషధ నిబంధనల్లో మార్పులు చేస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం ఇప్పటివరకు తయారీ, విక్రయం, పంపిణీకి సంబంధించి కొన్ని మినహాయింపులు ఉన్న 'షెడ్యూల్ K' జాబితా నుండి సిరప్లను ప్రభుత్వం తొలగించింది. ఈ నిర్ణయం వల్ల ఇవి ఇకపై 'ఓవర్-ది-కౌంటర్' (OTC) విక్రయాల పరిధిలోకి రావు.
ఇటీవలి కాలంలో ఓరల్ లిక్విడ్, దగ్గు మందుల నాణ్యత, భద్రతపై పెద్ద ఎత్తున ఆందోళనలు వెల్లువెత్తాయి. దగ్గు సిరప్ కారణంగా పలు మరణాలు సంభవించాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మార్పుకు సంబంధించి 2025 డిసెంబర్లోనే కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషనను జారీ చేసింది. ప్రజలు, నిపుణుల నుండి వచ్చిన సూచనలు, అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం, డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ (DTAB) సంప్రదింపులతో కేంద్ర ప్రభుత్వం ఈ తుది నిర్ణయాన్ని తీసుకుంది. తక్షణమే ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని, డాక్టర్ రాసిచ్చిన ప్రిస్కిప్షన్ లేకుండా ఏ కెమిస్ట్ కూడా సిరప్లను విక్రయించకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ద్వారా సిరప్ల దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు, ప్రజలకు సురక్షితమైన వైద్య సేవలు అందుతాయి అని పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు