
హైదరాబాద్, 27 జూన్ (హి.స.)
మహారాష్ట్ర శాసనసభలో బహుభార్యాత్వం (Polygamy), ట్రిపుల్ తలాక్ అంశాలపై ఎన్సిపి (అజిత్ పవార్ వర్గం) ఎమ్మెల్యే సనా మాలిక్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) స్పష్టం చేసింది. అసెంబ్లీలో ట్రిపుల్ తలాక్ బాధిత ముస్లిం మహిళలపై జరిగిన చర్చలో పాల్గొన్న సనా మాలిక్, బహుభార్యాత్వం అనేది కేవలం ముస్లిం పురుషులకే పరిమితం కాలేదని, ఇతర వర్గాలలోనూ ఇది ఉందని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఖురాన్లో పేర్కొన్న విషయాలు పాకిస్తాన్లో అమలువుతుంటే, వాటిని ఇక్కడ కూడా తీసుకురావాలని డిమాండ్ చేయడంతో సభలో తీవ్ర రాజకీయం రేగింది. బిజెపి, శివసేన ఎమ్మెల్యేలు ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలపై ఎన్సిపి రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ తత్కరే సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ X ద్వారా స్పందిస్తూ, సనా మాలిక్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని, వాటితో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. మతాన్ని పక్కనబెట్టి మహిళల హక్కులకు తమ పార్టీ ఎల్లప్పుడూ బలంగా మద్దతు ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. కాగా, తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను బహుభార్యాత్వాన్ని సమర్థించడం లేదని సనా మాలిక్ ఆ తర్వాత వివరణ ఇచ్చారు
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi