బోల్తాపడిన స్కూల్ బస్సు.. 15 మంది విద్యార్థులకు గాయాలు.
బోల్తాపడిన స్కూల్ బస్సు.. 15 మంది విద్యార్థులకు గాయాలు.
mumbai-school-bus-accident-ahilyanagar-rahuri-students-injured-suri-15387


అహల్యానగర్, 04 జూలై (హి.స.) : అహల్యానగర్లోని రాహురి ప్రాంతంలో ఓ స్కూల్ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో సుమారు 10 నుంచి 15 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తున్న బస్సు కొండ్వాడ్ సమీపానికి రాగానే ఒక్కసారిగా అదుపుతప్పింది. దీంతో రోడ్డు పక్కన ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ప్రమాదాన్ని గమనించిన ఇతర వాహనదారులు గ్రామస్థులు, పోలీసులకు సమాచారం అందించారు. అంతా కలిసి అతి కష్టం మీద చిన్నారులను బయటకు తీశారు. తీవ్ర గాయాలైన విద్యార్థులు హాహాకారాలు చేస్తుండగా వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

విద్యార్థులకు వైద్య సహాయం అందించిన డాక్టర్లు ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. ఘటన గురించి తెలుసుకున్న బాధిత కుటుంబాలు వెంటనే ఆస్పత్రికి చేరుకున్నాయి. అప్పటివరకు సంతోషంగా ఉన్న తమ చిన్నారులు తీవ్ర గాయాలతో రోదించడం చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. మరోవైపు ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 50 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కాగా, మూడు రోజుల కిందట ముంబైలో ఇలాంటి ఘటనే జరిగింది. వర్షాల కారణంగా యూనివర్సల్ హైస్కూల్కు చెందిన బస్సుపై చెట్టు కూలిపడి ఓ విద్యార్థి(11) మృతిచెందగా, మరో నలుగురు గాయపడ్డారు. ఈ ప్రమాద సమయంలో 13 మంది చిన్నారులు బస్సులో ఉన్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని వాహనంలో చిక్కుకుపోయిన విద్యార్థులందరినీ రక్షించారు. బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande