'రెండు రోజుల్లో సోనమ్ వాంగ్చుక్ చనిపోవచ్చు'- దిల్లీ హైకోర్టులో పిల్- గురువానికి వాయిదా
'రెండు రోజుల్లో సోనమ్ వాంగ్చుక్ చనిపోవచ్చు'- దిల్లీ హైకోర్టులో పిల్- గురువానికి వాయిదా
delhi


దిల్లీ, 15 జూలై (హి.స.)

ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ చేపట్టిన నివరధిక నిరహారదీక్ష 17వ రోజుకు చేరడంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. రెండు రోజుల్లో చనిపోయే ప్రమాదం ఉందని, వెంటనే జోక్యం చేసుకుని ఆయనను రక్షించాలంటూ దిల్లీ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. దీనిపై బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు, సోనమ్ వాంగ్​చుక్ ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో కేంద్రం, దిల్లీ ప్రభుత్వం తమ వైఖరిని తెలియజేయాలని నోటీసులు జారీ చేసింది. కేసును గురువారం మరోసారి విచారించనున్నట్లు వెల్లడించింది.

సోనం వాంగ్‌చుక్ జూన్‌ 28 నుంచి దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. తన నిరసనలో లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వాలు స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. దీక్ష కొనసాగుతున్న కొద్దీ ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా మారిందని రాకేశ్ కుమార్ సైనీ పిల్​ను దాఖలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరైన ఆయన, వాంగ్‌చుక్ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోందని, ప్రాణాపాయం తలెత్తే పరిస్థితి ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వైద్య సహాయం అందేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

వైద్య చికిత్సతో పాటు చర్చలు జరపాలని పిటిషన్

వాంగ్‌చుక్‌కు తక్షణమే అవసరమైన వైద్య చికిత్స, ప్రాణరక్షక సేవలు అందించాలని కేంద్రం, దిల్లీ ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. అలాగే ఆయన చేపట్టిన నిరసనలో లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వాలు చర్చలు ప్రారంభించేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసర వైద్యం, పోషకాహార సహాయం సహా అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పించి ఆయన ప్రాణాలను కాపాడాలని పిల్‌లో పేర్కొన్నారు. నిరాహార దీక్ష ప్రారంభించినప్పటి నుంచి సోనం వాంగ్‌చుక్ సుమారు 8.25 కిలోల బరువు కోల్పోయారని పేర్కొన్నారు. తరచూ రక్తంలో చక్కెర స్థాయులు తగ్గడం, తలతిరగడం, తీవ్ర నీరసం, కండరాల బలహీనత వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని వివరించారు.

పౌరుడి ప్రాణ రక్షణ ప్రభుత్వ బాధ్యతే

శాంతియుత నిరాహార దీక్ష రాజ్యాంగబద్ధమైన నిరసన రూపమని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ఒక పౌరుడి ప్రాణాలకు ముప్పు ఏర్పడినప్పుడు ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషించలేదని, ఆయన ప్రాణాలు, ఆరోగ్యాన్ని కాపాడటం ప్రభుత్వ రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని వాదించారు. ప్రాణనష్టం జరగకుండా సకాలంలో చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని పిటిషనర్ తెలిపారు.

కేంద్రం, దిల్లీ ప్రభుత్వానికి నోటీసులు

జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కారియా ధర్మాసనం పిటిషనర్ వాదనలు విన్న అనంతరం అత్యవసరతను గుర్తించింది. అదనపు సొలిసిటర్ జనరల్‌తో పాటు కేంద్ర ప్రభుత్వం, దిల్లీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తూ పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలపై తమ స్పందన తెలియజేయాలని ఆదేశించింది. విచారణ సందర్భంగా ప్రతివాదుల తరఫున ఎలాంటి న్యాయవాది హాజరుకాలేదని ధర్మాసనం నమోదు చేసింది. జిల్లా కోర్టుల ఆర్థిక అధికార పరిధి పెంపును వ్యతిరేకిస్తూ దిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ ఇచ్చిన బహిష్కరణ పిలుపు కారణంగా న్యాయవాదులు కోర్టు కార్యకలాపాలకు దూరంగా ఉన్నారని పేర్కొంది. దీంతో ప్రభుత్వ తరఫున కూడా ఎలాంటి న్యాయాధికారి కోర్టుకు హాజరు కాలేకపోయారని వెల్లడించింది.

ప్రభుత్వం తమతో చర్చలు జరపకుండా నిరవధిక నిరాహార దీక్ష విరమించేది లేదని సోనమ్ వాంగ్​చుక్​ స్పష్టం చేశారు. ప్రభుత్వం ముందుకు రావాల్సిందేనని ఆయన డిమాండ్​ చేశారు. అయితే వాంగ్‌చుక్‌ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిందని, దీక్ష విరమించాలని కోరినా ఆయన వినడం లేదని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే తెలిపారు. దీక్ష విరమించాలని వాంగ్‌చుక్‌కు ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ సూచించారు. తాను గురువారం స్వయంగా వచ్చి కలుస్తానని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande