రాహుల్ గాంధీ కార్యక్రమానికి అనుమతి రద్దు.. ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ భారీ నిరసనలు!
రాహుల్ గాంధీ కార్యక్రమానికి అనుమతి రద్దు.. ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ భారీ నిరసనలు!
BJP attacks Rahul Gandhi's statement that the government will fall within a year


డెహ్రాడూన్‌, 15 జూలై (హి.స.)

లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ డెహ్రాడూన్ పర్యటనకు సంబంధించి ఉత్తరాఖండ్‌లో తీవ్ర రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. దేశవ్యాప్తంగా సాగుతున్న ‘ఛాత్రోం కీ గూంజ్’ (విద్యార్థుల గర్జన) ప్రచారంలో భాగంగా, జూలై 17న డెహ్రాడూన్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో విద్యార్థులు, యువతతో రాహుల్ గాంధీ ముఖాముఖి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అయితే, ఈ కార్యక్రమానికి గతంలో ఇచ్చిన అనుమతిని ఉత్తరాఖండ్ యంత్రాంగం అకస్మాత్తుగా రద్దు చేయడంతో పాటు వేదికను మార్చాల్సిందిగా ఆదేశించింది.

అంతేకాకుండా, కార్యక్రమ ఏర్పాట్ల కోసం సామగ్రిని తీసుకువస్తున్న ట్రక్కులను రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అడ్డుకుందని ఆరోపిస్తూ ఉత్తరాఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (PCC) అధ్యక్షుడు గణేష్ గోడియాల్ నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులు డెహ్రాడూన్‌లో భారీ నిరసన ప్రదర్శనకు దిగాయి. పరేడ్ గ్రౌండ్ వేదికకు సంబంధించి తమ వద్ద అన్ని అధికారిక అనుమతి పత్రాలు ఉన్నప్పటికీ, యంత్రాంగం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని కాంగ్రెస్ నేతలు మీడియాకు ఆధారాలను చూపించారు.

యువత, విద్యార్థుల సమస్యలపై రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటాన్ని చూసి బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం భయపడిందని, అందుకే ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. ప్రభుత్వ ఆంక్షలు, అడ్డంకులు ఎదురైనప్పటికీ రాహుల్ గాంధీ పర్యటన మరియు యువతతో ముఖాముఖి కార్యక్రమం అనుకున్నట్లుగానే సాగుతుందని కాంగ్రెస్ స్పష్టం చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande