
పూరీ, 16 జూలై (హి.స.) ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే పూరీ జగన్నాథ రథయాత్రకు ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.
ఈ మహోత్సవంలో భాగంగా లోకనాయకుడైన జగన్నాథుడు తన సోదరసోదరీమణులతో కలిసి గుండిచా ఆలయానికి బయలుదేరనున్నారు. శ్రీజగన్నాథ స్వామి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నందిఘోష్ రథంపై భక్తులకు దర్శనమిస్తూ ముందుకు సాగనుండగా.. సోదరుడు బలభద్రుడు తాళధ్వజ రథంపై, సోదరి సుభద్రాదేవి దర్పదళన్ రథంపై కొలువై భక్తుల కోలాహలం మధ్య పయనించనున్నారు.
ఈ అద్భుత ఆధ్యాత్మిక దృశ్యాన్ని వీక్షించేందుకు, రథాలను లాగి స్వామివారి కృపకు పాత్రులు కావడానికి దేశవిదేశాల నుంచి భక్తులు పూరీకి పోటెత్తారు. ఈ నెల 24 వరకు అత్యంత వైభవంగా సాగే ఈ రథయాత్ర మహోత్సవంలో ప్రతి ఘట్టాన్నీ భక్తులు కనులారా వీక్షించేలా సకల ఏర్పాట్లుచేశారు అధికారులు.
ఈ వేడుకలను వీక్షించేందుకు సుమారు 15 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. ఇంతటి జనసందోహాన్ని దృష్టిలో ఉంచుకుని ఒడిశా ప్రభుత్వ యంత్రాంగం, పోలీస్ శాఖ అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, రవాణా, వైద్య సేవలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్థానిక అధికారులు అన్ని చర్యలు తీసున్నారు. నగరవ్యాప్తంగా సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ల నిఘాతో పాటు వేలాది మంది పోలీస్ సిబ్బందిని మోహరించి శాంతిభద్రతలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. భక్తిశ్రద్ధలు, జయజయధ్వానాల మధ్య సాగనున్న ఈ రథయాత్రను విజయవంతం చేసేందుకు అన్ని విభాగాలు సర్వసన్నద్ధమయ్యాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV