
బెంగళూరు, 17 జూలై (హి.స.)
బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (BLR) నుండి గురువారం రాత్రి అహ్మదాబాద్ బయలుదేరాల్సిన ఇండిగో విమానానికి (IndiGo Flight 6E-6423) నకిలీ బాంబు బెదిరింపు రావడంతో ఎయిర్‌పోర్టులో తీవ్ర కలకలం రేగింది. విమానం టేకాఫ్ కావడానికి కేవలం అరగంట ముందు ఈ విషయం వెలుగుచూడటంతో ఎయిర్‌పోర్ట్ అధికారులు, రక్షణ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ ఘటనపై ఎయిర్‌పోర్ట్ పోలీసులు కేసు (FIR) నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారుపోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 16 రాత్రి 8 గంటలకు బెంగళూరు నుండి అహ్మదాబాద్ వెళ్లాల్సిన విమానంలోని కేబిన్ క్రూ సిబ్బంది రాత్రి 7:35 గంటల సమయంలో ముందు భాగంలో ఉండే వాష్‌రూమ్ (Lavatory) లో ఒక చేతిరాతతో కూడిన కాగితాన్ని కనుగొన్నారు. ఆ నోట్‌పై ఇంగ్లీష్, హిందీ భాషల్లో Don't go. Bomb Hai! Please (వెళ్లకండి, బాంబు ఉంది దయచేసి) అని రాసి ఉంది. దీంతో సిబ్బంది వెంటనే పైలట్‌కు, ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ విభాగానికి సమాచారం అందించారు.విమానాశ్రయ అధికారులు వెంటనే 'బాంబు త్రెట్ అసెస్‌మెంట్ కమిటీ' (BTAC) ని ఏర్పాటు చేసి భద్రతా ప్రోటోకాల్స్‌ను అమలు చేశారు. విమానంలో ఉన్న ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించి, ప్రత్యేక ఐసోలేషన్ బేకి తరలించారు. అనంతరం బాంబు స్క్వాడ్, స్నిఫర్ డాగ్స్ సహాయంతో విమానం మొత్తం, ప్రయాణికుల లగేజీలను అంగుళం అంగుళం క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే గంటల తరబడి జరిపిన ఈ సోదాల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు కానీ, అనుమానాస్పద వస్తువులు కానీ లభించకపోవడంతో అధికారులు అది నకిలీ బెదిరింపు (Hoax Threat) అని తేల్చారు.ఈ ఆకస్మిక తనిఖీలు మరియు భద్రతా చర్యల వల్ల విమాన ప్రయాణం చాలా సమయం ఆలస్యమైంది, దీనితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రయాణికులు మరియు సిబ్బంది భద్రతకు తీవ్ర భంగం కలిగించడమే కాకుండా ఎయిర్‌లైన్స్ సేవలకు ఆటంకం కలిగించినందుకు గాను ఇండిగో ఎయిర్‌లైన్స్ యాజమాన్యం కెంపేగౌడ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు శుక్రవారం (జూలై 17) ఉదయం కేసు నమోదు చేసి, ఆ నకిలీ లేఖ రాసి విమానంలో పెట్టిన నిందితుడిని గుర్తించడానికి విమాన ప్రయాణికుల వివరాలను విశ్లేషిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi