భారత రైల్వే చరిత్రలో సరికొత్త విప్లవం: దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
భారత రైల్వే చరిత్రలో సరికొత్త విప్లవం: దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
రైలు


జింద్ (హర్యానా) , 17 జూలై (హి.స.)

భారతీయ రైల్వే చరిత్రలో పర్యావరణహిత రవాణా దిశగా సరికొత్త సువర్ణ అధ్యాయం లిఖితమైంది. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఇంధన ఆధారిత ప్యాసింజర్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్‌లో పచ్చజెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ గ్రీన్ రైలు ప్రారంభంతో.. పర్యావరణహిత హైడ్రోజన్ రైళ్లను నడుపుతున్న జర్మనీ, జపాన్, చైనా, అమెరికా వంటి ప్రపంచంలోని కొన్ని అత్యున్నత దేశాల ప్రత్యేక జాబితాలో భారతదేశం అధికారికంగా చేరింది. ఈ తొలి హైడ్రోజన్ రైలు హర్యానాలోని జింద్ - సోనిపట్ మధ్య ఉన్న 89 కిలోమీటర్ల పైలట్ మార్గంలో ప్రయాణించనుంది. ఈ ప్రయాణాన్ని రెండు గంటల్లో పూర్తి చేసేలా, జింద్ జంక్షన్, గోహానాతో పాటు మరో 12 ఇంటర్మీడియట్ స్టేషన్లలో ఆగే విధంగా దీనిని రూపొందించారు. ఉత్తర రైల్వే (Northern Railway) పరిధిలోకి వచ్చే ఈ ప్రత్యేక ప్రాజెక్టు కోసం జింద్ వద్దే స్వదేశీ హైడ్రోజన్ నిల్వ, ఇంధనం నింపే (Refuelling) ప్రత్యేక సదుపాయాన్ని కూడా రైల్వే శాఖ విజయవంతంగా ఏర్పాటు చేసింది.ఈ హైడ్రోజన్ రైలులో అద్భుతమైన సాంకేతిక ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది మొత్తం 10 బోగీలతో కూడిన ప్రపంచంలోనే సుదీర్ఘమైన హైడ్రోజన్ రైల్‌సెట్లలో ఒకటిగా నిలిచింది. ఈ రైలులో ఒకేసారి సుమారు 2,600 మంది ప్రయాణికులు కూర్చుని ప్రయాణించవచ్చు. చెన్నైకి చెందిన ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) అభివృద్ధి చేసిన ఈ రైలు, గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో (110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యంతో) నడిచేలా 2,400 కిలోవాట్ల హైడ్రోజన్ ప్రొపల్షన్ వ్యవస్థతో డిజైన్ చేయబడిందిఈ రైలు యొక్క అత్యంత ముఖ్యమైన విశేషం ఏమిటంటే.. దీనికి డీజిల్ లేదా విద్యుత్ తీగలతో (Overhead wires) ఎటువంటి అవసరం లేదు. రైలుపైనే అమర్చిన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ సహాయంతో ప్రోటాన్ ఎక్స్ఛేంజ్ మెంబ్రేన్ సాంకేతికత ద్వారా స్వయంగా విద్యుత్‌ను తయారు చేసుకుంటూ ఇది ప్రయాణిస్తుంది. సాంప్రదాయ డీజిల్ రైళ్లలా కాకుండా, ఈ ప్రక్రియలో కాలుష్య కారకాలకు బదులుగా కేవలం స్వచ్ఛమైన నీటి ఆవిరి (Water Vapor) మాత్రమే బయటకు విడుదలవుతుంది. తద్వారా ఇది పూర్తిగా శబ్దరహితంగా, 100% పర్యావరణహితంగా సేవలందిస్తుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, స్వచ్ఛమైన, సుస్థిర సాంకేతికతను రైల్వే రంగంలోకి విస్తరించేందుకు ఇది ఒక కీలకమైన అడుగు అని కొనియాడారు. భారత రైల్వే నిర్దేశించుకున్న 2030 నాటి 'నెట్-జీరో కార్బన్ ఎమిషన్స్' (సున్నా కాలుష్యం) లక్ష్య సాధనలో, అలాగే 'హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్' ప్రణాళికలో భాగంగా దేశవ్యాప్తంగా త్వరలోనే మరో 35 హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమంతో పాటు, జింద్‌లో సుమారు ₹14,700 కోట్ల విలువైన పలు ఇతర అభివృద్ధి పనులకు కూడా ప్రధాని శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేశారు.

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande