
హైదరాబాద్, 18 జూలై (హి.స.)అమృత్భారత్ స్టేషన్ పథకం కింద సరికొత్త హంగులతో అభివృద్ధి చేసిన హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించారు. 20 రాష్ట్రాల్లోని 75 అమృత్ స్టేషన్లను జాతికి అంకితం చేశారు. వీటిలో తెలుగు రాష్ట్రాల్లోని రాయనపాడు, మంగళగిరి రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఈ సందర్భంగా హైటెక్ సిటీ రైల్వేస్టేషన్లో జరిగిన కార్యక్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు మాట్లాడుతూ.. అమృత్భారత్ స్కీమ్ కింద రాష్ట్రంలో 41 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ జరుగుతోందన్నారు. ఈ నెల 26న కొమురవెల్లి రైల్వేస్టేషన్ను కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి సమక్షంలో ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి మాట్లాడుతూ.. గత 12 ఏళ్లలో ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో రైలు ప్రయాణం పూర్తిగా రూపాంతరం చెందిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.40 వేల కోట్లకు పైగా రైల్వే అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 75 అమృత్ స్టేషన్లలో ద.మ.రైల్వే పరిధిలో ఉన్న హైటెక్ సిటీ స్టేషన్ ఒకటిగా నిలవడం గర్వకారణమన్నారు. హైటెక్ సిటీ అమృత్ స్టేషన్ రూపాంతరాన్ని పురస్కరించుకుని జంట నగరాల్లోని ఆరు పాఠశాలల్లో నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం, సెల్ఫీ పోటీ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ డా.ఆర్.గోపాలకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్