
హైదరాబాద్, 18 జూలై (హి.స.)ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ సెమీకండక్టర్ హబ్గా మారుతోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి పేర్కొన్నారు. సెమికాన్ 2.0 కార్యక్రమం ద్వారా పన్నెండేళ్లలో రూ.1,27,500 కోట్లను ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ రంగాల్లో ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. రూ.62,500 కోట్లతో తీసుకొచ్చిన మొబైల్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కీమ్(ఎంపీఎంఎస్) తయారీ రంగంలో విప్లవాత్మక బాటలు వేయనుందన్నారు. సెమీకండక్టర్ రంగంలో తెలంగాణకు కేంద్రం అందించిన ప్రయోజనాలను వివరిస్తూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘తెలంగాణలో ఈఎంసీల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.724 కోట్ల ఆర్థిక సాయం చేసింది. ఈ-సిటీ, ఫ్యాబ్ సిటీలో ఏర్పాటు చేసిన గ్రీన్ఫీల్డ్ ఈఎంసీ ప్రాజెక్టు కోసం రూ.252 కోట్లు, మహేశ్వరం గ్రీన్ఫీల్డ్ ఈఎంసీ కోసం రూ.139 కోట్లు, హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్న కామన్ ఫెసిలిటీ సెంటర్కు రూ.75 కోట్లు, మహబూబ్నగర్లో జిల్లా దివిటిపల్లిలో ఏర్పాటు చేయనున్న ఈఎంసీ ప్రాజెక్టు కోసం రూ.258 కోట్లను రాష్ట్రానికి అందించింది. కేంద్రం తీసుకొచ్చిన సెమికాన్ 2.0తో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు రూ.1,000 కోట్లకు పైగా ప్రోత్సాహకాలు అందించింది. సెమికాన్ 2.0 ద్వారా తెలంగాణలో ఫోన్ల తయారీ, కంపోనెంట్ తయారీ కేంద్రాలు ఏర్పడటానికి అవకాశాలు పెరుగుతాయి’ అని కేంద్రమంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్