
హైదరాబాద్, 18 జూలై (హి.స.)పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పరుగులు పెట్టించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ మేరకు గృహ నిర్మాణానికి సంబంధించిన అనేక రకాల ఫీజులను రద్దుచేయడంతోపాటు పలు అనుమతులను చకచకా మంజూరు చేసేందుకు సింగిల్ విండో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. పట్టణ ప్రాంతాల్లోని బలహీన వర్గాలు(ఈడబ్ల్యూఎస్), అల్పాదాయ వర్గాల(ఎల్ఐజీ) కోసం నిర్మించే ఇందిరమ్మ ఇళ్లకు.. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం కోసం 2016లో రూపొందించిన ప్రత్యేక మార్గదర్శకాలను అమలు చేయాలంటూ తెలంగాణ గృహనిర్మాణ మండలి (టీజీహెచ్బీ) చేసిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్