70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతా: కేటీఆర్
యువ గళాలు గర్జిస్తే కుర్చీలు కూలిపోతాయి .. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ సరూర్నగర్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సులో ఆయన మాట్లాడారు.
KTR


హైదరాబాద్, 18 జూలై (హి.స.)యువ గళాలు గర్జిస్తే కుర్చీలు కూలిపోతాయి .. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ సరూర్నగర్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సులో ఆయన మాట్లాడారు. యూత్ డిక్లరేషన్ పేరిట మోసం చేసిన కాంగ్రెస్ నేతలకు డెత్ డిక్లరేషన్ ఇవ్వాలని ఘాటుగా విమర్శించారు.

‘‘తెలంగాణ ఉద్యమంలో వేల మంది విద్యార్థులను చంపిన పార్టీ కాంగ్రెస్. జిత్తులమారి నక్కలాంటి కాంగ్రెస్ పార్టీ యువతను మోసం చేసింది. యువతరంతో పెట్టుకుంటే తరాలపాటు పుట్టగతులు లేకుండా పోతారు. యూత్ డిక్లరేషన్లో రాహుల్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి. తెలంగాణలో నోటిఫికేషన్లు లేవు.. లూటిఫికేషన్లే. యువతకు జాబులు లేవు.. రాహుల్గాంధీ జేబులే నిండుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం 70వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నోటిఫికేషన్లతో సహా నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటా. రాహుల్గాంధీని ప్రధానిని చేసేవరకు విశ్రమించనని రేవంత్రెడ్డి అంటున్నారు. రేవంత్కు పదవి ఇచ్చింది యువతకు జాబులు ఇచ్చేందుకా.. రాహుల్కు జాబ్ ఇచ్చేందుకా? తెలుగు, ఇంగ్లీష్ క్యాలెండర్లు మారాయి కానీ, జాబ్ క్యాలెండర్ మాత్రం మారట్లేదు. అసెంబ్లీలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ను చిత్తు కాగితంతో సమానం చేశారు. జంగ్ సైరన్ మోగించడానికి నేడు యువతరం కదిలివచ్చింది. రేవంత్రెడ్డి క్లైమాక్స్ హిట్లర్ కంటే దారుణంగా ఉంటుంది’’ అని కేటీఆర్ హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande