
హైదరాబాద్, 18 జూలై (హి.స.)ప్రేమ పేరుతో ఓ యువతిని డిస్క్ జాకీ(డీజే ప్లేయర్) మోసం చేసిన ఘటన హైదరాబాద్లో వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో డీజే ప్లేయర్ తిలక్ ప్రవీణ్ కుమార్పై యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకున్నాడంటూ యువతి ఫిర్యాదులో పేర్కొంది. యువతికి ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రవీణ్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారగా, పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించింది. అంతేకాకుండా, తన నుంచి సుమారు రూ.3 లక్షలు తీసుకున్నాడని బాధితురాలు తెలిపింది.
ఇంకా డబ్బులు ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తూ బ్లాక్మెయిల్కు పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. వ్యక్తిగత ఫొటోలను తీసి వాటిని బయటపెడతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడని వాపోయింది. తిలక్ వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదును స్వీకరించిన జూబ్లీహిల్స్ పోలీసులు ప్రవీణ్ కుమార్పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్