
మెదక్, 18 జూలై (హి.స.)
ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో
సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. శనివారం మెదక్ జిల్లా చేగుంటలో నిర్వహించిన ఎల్నినో వాతావరణ పరిస్థితుల్లో రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావంతో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగి సాధారణ వర్షపాతం తగ్గే అవకాశం ఉంటుందని దీనివల్ల వరి వంటి అధిక నీటి అవసరమున్న పంటల సాగు రైతులకు ఇబ్బందులు కలిగించవచ్చని అన్నారు. అందువల్ల నీటి వినియోగం తక్కువగా ఉండే పంటలను సాగు చేయడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చని సూచించారు.
వరి సాగుకు బదులుగా పెసర, మినుము, కంది, ఆముదం, నువ్వులు, ప్రొద్దుతిరుగుడు వంటి నూనెగింజల పంటలు అలాగే జొన్న, సజ్జ రాగులు వంటి చిరుధాన్యాల సాగు రైతులకు అనుకూలమని పేర్కొన్నారు. ఆయా పంటల సాగుకు అనువైన విత్తే సమయం విత్తన మోతాదు పంట కాలం ఆశించిన దిగుబడులపై వ్యవసాయ అధికారులు రైతులకు వివరించారు. నీటి పొదుపు పద్ధతులు వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే సాగు విధానాలు తక్కువ వ్యవధిలో దిగుబడి ఇచ్చే పంటల ఎంపిక మార్కెట్ అవకాశాలపై రైతులకు సూచనలు అందించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..