
ఖమ్మం, 18 జూలై (హి.స.)
మండల పర్యటనలో భాగంగా ఖమ్మం జిల్లాలో పర్యటించిన మంత్రి పొంగులేటి మల్లాయిగూడెం కార్యక్రమాన్ని ముగించుకుని లింగారం తండా, జుజ్జులరావుపేట గ్రామ శివార్ల మీదుగా కోక్యా తండాకు వెళ్తున్న సమయంలో మార్గమధ్యలో పనుల్లో నిమగ్నమైన మహిళా కూలీలను చూసి తన కాన్వాయ్ను ఆపారు. వాహనం దిగి నేరుగా మహిళా కూలీల వద్దకు వెళ్లిన మంత్రి వారితో ఆప్యాయంగా మాట్లాడి వారి కష్టసుఖాలు, కుటుంబ పరిస్థితులు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను ఓపికగా విన్న ఆయన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, ఉచిత విద్యుత్తో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అర్హులకు అందేలా చర్యలు తీసుకుంటున్నామని భరోసా కల్పించారు. మంత్రి స్వయంగా వాహనం ఆపి తమ వద్దకు వచ్చి ఆప్యాయంగా మాట్లాడడంతో మహిళా కూలీలు ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకోవడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు