
తిరుపతి , 18 జూలై (హి.స.)తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (SHAR) నుండి ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 'విక్రమ్-1' ప్రైవేట్ రాకెట్ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తిరుపతి జిల్లాకు వచ్చారు. మంత్రి రాకతో జిల్లాలోని ముఖ్యంగా సూళ్ళూరుపేట మార్గమంతా కార్యకర్తల సందడి నెలకొంది.
ఈ పర్యటనలో భాగంగా శ్రీ సిటీ హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న మంత్రి నారా లోకేష్కు, సూళ్ళూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ మరియు ఆమె భర్త పార్థసారథి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. రోడ్డు మార్గం ద్వారా మంత్రి శ్రీహరికోట వైపు ప్రయాణిస్తుండగా, దారి పొడవునా పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఘనంగా స్వాగతం పలికారు. కార్యకర్తల నినాదాలు, ఉత్సాహంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది.
ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, స్థానిక సమస్యలపై ఎమ్మెల్యే డా.నెలవల విజయశ్రీ మంత్రితో చర్చించారు. అంతరిక్ష పరిశోధన రంగంలో భారతదేశ కీర్తిని చాటుతున్న 'విక్రమ్-1' రాకెట్ ప్రయోగాన్ని తిలకించడం పట్ల మంత్రి ఉత్సాహం వ్యక్తం చేశారు. ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా, సూళ్ళూరుపేట ప్రాంతంలో పారిశ్రామిక మరియు విద్యాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి సమీక్షించనున్నారు.
మంత్రి పర్యటన సందర్భంగా స్థానిక అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, పార్థసారథితో పాటు పలువురు పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు మరియు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV