
హైదరాబాద్, 18 జూలై (హి.స.)
తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలపై, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల విఫలతపై గళమెత్తేందుకు బీఆర్ఎస్ చేపట్టిన 'యువ సంగ్రామ సదస్సు' తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. సరూర్ నగర్ స్టేడియంలో మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ సదస్సుపై ప్రభుత్వం తొలుత ఆంక్షలు విధించింది. దీంతో, బీఆర్ఎస్ ఏకంగా హైకోర్టు మెట్లెక్కి మరీ న్యాయబద్ధంగా అనుమతి తెచ్చుకుంది. అయితే సభ ప్రారంభానికి ముందే పోలీసులు చర్యలు చేపట్టారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌లను పోలీసులు వారి ఇళ్లలోనే హౌస్ అరెస్టు చేశారు.
ఈ నిర్బంధంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన నివాసం నుండి ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇవాళ ఉదయాన్నే పోలీసులు తనను అరెస్టు చేయడానికి ఇంటికి వచ్చారని ఆయన మండిపడ్డారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్న యువ సంగ్రామ సదస్సుకు తాను వెళ్లాల్సి ఉందని, దానికి హైకోర్టు అనుమతి కూడా ఉందని చెప్పినా పోలీసులు వినలేదన్నారు. తమకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయని, మిమ్మల్ని ఎక్కడికీ పోనివ్వద్దని పోలీసులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయస్థానం పర్మిషన్ ఇచ్చినా కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi