నేటితో హైడ్రాకు రెండేండ్లు.. రూ 1.50 లక్షల కోట్ల విలువైన 3,315 ఎకరాలు స్వాధీనం
నేటితో హైడ్రాకు రెండేండ్లు.. రూ 1.50 లక్షల కోట్ల విలువైన 3,315 ఎకరాలు స్వాధీనం
Hydra


హైదరాబాద్, 19 జూలై (హి.స.)

హైడ్రా ఏర్పడి ఆదివారంతో రెండేండ్లు పూర్తి చేసుకుని మూడో ఏడాదిలోకి అడుగుపెట్టనుంది. రూ.1.50 లక్షల కోట్ల విలువైన 3,315 ఎకరాల విలువ భూమిని కాపాడింది. హైడ్రా చేపట్టిన చర్యల్లో అత్యధికంగా 1,810 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుంచి విముక్తి చేసింది. చెరువుల వద్ద ఆక్రమణలు తొలగించి 454.11 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకుంది. 90.39 ఎకరాల పార్కు స్థలాలు, 62.11 ఎకరాల రోడ్లు, ఫుట్పాత్లు, అలాగే పబ్లిక్ ఓపెన్ ప్లేస్లకు సంబంధించి 26.31 ఎకరాలు స్వాధీనం చేసుకోగా, నాలాలపై ఆక్రమణలను తొలగించి 25.37 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. ఆక్రమణల తొలగింపులో భాగంగా రెండేళ్లలో 1,378 అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది.

హైడ్రా ఏర్పడిన మొదటి సంవత్సరంలో రూ.30 వేల కోట్ల విలువైన భూములను కాపాడితే రెండో సంవత్సరంలో రూ.1.20 లక్షల కోట్ల విలువైన భూములను కాపాడింది. 2024 జూన్ 27న లోటస్ పాండ్లో ఫిలింనగర్లో కో ఆపరేటివ్ సొసైటీలో లోటస్ పాండ్ పార్క్ స్థలాన్ని కబ్జా చేసి కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని కూల్చడంతో మొదలైంది. అప్పటి వరకు జీహెచ్ఎంసీ ఈవీడీఎంగా ఉన్న ఈ విభాగాన్ని జులై 19న హైడ్రా గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. మొదటిలో కాలంలో 581 ఆక్రమణలను తొలగించి 499 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది. రెండో ఏడాదిలో 801 ఆక్రమణలు తొలగించి ఏకంగా 2,812 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది.

రెండేండ్లలో 20 చెరువులకు సంబంధించిన ఆక్రమణలను తొలగించి అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.

వీటిలో ఇప్పటికే ఆరు చెరువులను అభివృద్ధి చేసింది. మరో 14 చెరువులను రెండో దశలో అభివృద్ధి చేయాలని హైడ్రా నిర్ణయించింది. మొదటి దశలో ఆరు చెరువులను హైడ్రా అభివృద్ధి చేయగా, ఇందులో ఇప్పటికే బతుకమ్మకుంట, కూకట్పల్లి నల్ల చెరువు, బమృక్ ఉద్దేలా ఈ మూడు చెరువులు అందుబాటులోకి వచ్చాయి. మరో మూడు చెరువులు అందుబాటులోకి రానున్నాయి. అలాగే రెండో విడతలో 14 చెరువుల పనులను హైడ్రా చేపట్టింది. వీటికి తోడు క్యూర్ పరిధిలో నలు దిక్కుల నాలుగు చెరువులను మినీ ట్యాంక్ బండ్గా డెవలప్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఆదేశించింది. ఈ మేరకు రూ.227.98 కోట్లకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఈ నిధులతో ఫాక్స్ సాగర్, అమీన్పూర్ చెరువు, అంబర్ చెరువు, సరూర్నగర్ చెరువులకు మినీ ట్యాంక్ బండ్లను ఏర్పాటు చేయడానికి హైడ్రా కసరత్తు చేస్తోంది.

ఇదిలా ఉండగా హైడ్రాకు వ్యతిరేకంగా ఏకంగా 1200 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిలో 900 కేసులను కోర్టుల్లో హైడ్రా అధికారులు, అడ్వకేట్లు పరిష్కరించుకుంటూ వచ్చారు. మిగిలిన కేసులు ట్రయల్లో ఉన్నాయి. భూవివాదాలు, యాజమాన్య హక్కులు, కూల్చివేతల చట్టబద్ధత వంటి అంశాలపై న్యాయపరమైన పోరాటం కొనసాగుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande