సింగరేణి కార్మికులకు అన్యాయం జరుగుతుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు?: కవిత
సింగరేణి కార్మికులకు అన్యాయం జరుగుతుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు?: కవిత
Kavita


హైదరాబాద్, 19 జూలై (హి.స.)

సింగరేణిలో మెడికల్ అన్ఫిట్ కోసం దరఖాస్తు చేసుకున్న 2 వేల మంది కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇచ్చే వరకు తెలంగాణ రక్షణ సేన ఉద్యమిస్తుందని ఆపార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) అన్నారు. మెడికల్ బోర్డు నిర్వహించకుంటే నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని తెలంగాణ రక్షణ సేన హెచ్చరించడంతో ప్రభుత్వం రెండు రోజుల పాటు నామమాత్రంగా మెడికల్ బోర్డు నిర్వహించిందన్నారు. 2 వేల మంది కార్మికులు మెడికల్ బోర్డు కోసం ఎదురు చూస్తుంటే కేవలం 120 మంది కార్మికుల పేర్లు మాత్రమే ప్రకటించిందని, అందులోనూ 28 మంది కార్మికులకు తమను మెడికల్ బోర్డుకు పిలిచారనే సమాచారం కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇవాళ ఓ వీడియో రిలీజ్ చేసిన కవిత రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

మెడికల్ బోర్డుకు పిలిచిన వారిలో కేవలం 20 శాతం మందినే అన్ ఫిట్ చేశారని సింగరేటణిని (Singareni) కాపాడాలని, కార్మికులకు మంచి చేయాలని వారికి భరోసా ఇవ్వాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. కాంట్రాక్టర్ల నుంచి వచ్చే కమీషన్లకు సీఎం, డిప్యూటీ సీఎం కక్కుర్తి పడి సింగరేణి సంస్థను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని ద్వజమెత్తారు. గతంలో మాదిరిగానే అన్ ఫిట్ ప్రక్రియను కొనసాగించాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ కోల్ బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు సిగ్గుతో తలదించుకోవాలని, కార్మికులకు అన్యాయం జరుగుతుంటే సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? మీరు మీ ముఖ్యమంత్రి కాళ్లు పట్టుకుంటరా? బతిమాలుకుంటరా? అనేది మీరే నిర్ణయించుకుని ప్రతినెలా రెండు సార్లు మెడికల్ బోర్డు పెట్టించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో కోల్ బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలను నిలదీయాలని హెచ్ఎంఎస్, తెలంగాణ రక్షణ సేన క్యాడర్క పిలుపునిచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande