
కామారెడ్డి, 19 జూలై (హి.స.) కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఉదయాన్నే ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఎర్రమనుకుచ్చ, బీసీ కాలనీల్లో డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బలగాలు తనిఖీలు నిర్వహించాయి. తెల్లవారుజామున 5 గంటల నుంచి పోలీసులు హడావుడి చేయడంతో ఏం జరిగిందోనని ప్రజలు అయోమయానికి గురయ్యారు. పోలీసుల తనిఖీల్లో భాగంగా ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేని సుమారు 135 బైక్ లు, 8 ఆటోలు, కార్లు ఇతర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ.. నిబంధనలు పాటించని వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సరైన పత్రాలు తీసుకొచ్చి వాహనాలను తీసుకెళ్లాలని డీఎస్పీ సూచించారు. చోరీ చేసిన వాహనాలతో కొందరు వ్యక్తులు చట్టవ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..