సాధారణ కుటుంబం నుంచి అంతరిక్ష రంగం వరకు.. సూర్యాపేట జిల్లా యువకుడి స్ఫూర్తిదాయక విజయగాథ
సాధారణ కుటుంబం నుంచి అంతరిక్ష రంగం వరకు.. సూర్యాపేట జిల్లా యువకుడి స్ఫూర్తిదాయక విజయగాథ
Engineer


సూర్యాపేట, 19 జూలై (హి.స.)

సాధారణ కుటుంబంలో జన్మించి, కష్టాన్ని నమ్ముకుని లక్ష్యసాధన కోసం నిరంతరం శ్రమిస్తే ఎంతటి ఉన్నత శిఖరాలనైనా అధిరోహించవచ్చని సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల కేంద్రానికి చెందిన యువ ఇంజినీర్ గంధం లక్ష్మీనాథ్ నిరూపించారు. ప్రస్తుతం దేశీయ ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేస్తున్న ప్రతిష్ఠాత్మక విక్రమ్-1 రాకెట్ ప్రాజెక్టులో ఎలక్ట్రికల్ హార్నెస్ డిజైన్ అండ్ ఇంటిగ్రేషన్ ఇంజినీర్ గా కీలక బాధ్యతలు నిర్వహిస్తూ జిల్లా పేరు దేశవ్యాప్తంగా నిలబెడుతున్నారు.ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేసే తండ్రి గంధం శ్రీను, ఉపాధ్యాయురాలిగా పనిచేసిన తల్లి శ్రీవాణి దంపతుల రెండో కుమారుడైన లక్ష్మీనాథ్ చిన్నప్పటి నుంచే చదువుపై ఆసక్తి కనబరిచాడు.

కుటుంబ ఆర్థిక పరిస్థితులు సాధారణంగానే ఉన్నప్పటికీ, తల్లిదండ్రులు చదువులో ఎలాంటి లోటు రానీయకుండా ప్రోత్సహించారు. అదే ఆయన విజయానికి బలమైన పునాదిగా నిలిచింది.చింతలపాలెం సమీపంలోని సీత మెమోరియల్ స్కూల్లో పదో తరగతి వరకు చదివిన లక్ష్మీనాథ్, అనంతరం ఇంటర్మీడియట్, బీటెక్ హైదరాబాద్ లో పూర్తి చేసి తన ప్రతిభతో ఉద్యోగాన్ని సాధించారు. తొలుత డి ఆర్ డి ఏ హైదరాబాద్లోని ఎలక్ట్రికల్ డిజైన్ అండ్ ఇంటిగ్రేషన్ రంగంలో పనిచేసి అనుభవం సంపాదించిన ఆయన, ప్రస్తుతం స్కైరూట్ ఏరోస్పేస్లో విక్రమ్-1 రాకెట్ ప్రాజెక్టులో విద్యుత్ వ్యవస్థల రూపకల్పన, వైరింగ్, ఇంటిగ్రేషన్, సాంకేతిక పరీక్షలు వంటి అత్యంత కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఒక చిన్న గ్రామం నుంచి దేశ అత్యంత ప్రతిష్ఠాత్మక అంతరిక్ష ప్రాజెక్టులో భాగస్వామి కావడం లక్ష్మీనాథ్ పట్టుదల, కృషికి నిదర్శనంగా నిలిచింది. సాధారణ కుటుంబంలో పుట్టినా, గొప్ప లక్ష్యాలు పెట్టుకుని కష్టపడితే ప్రపంచ స్థాయిలో గుర్తింపు సాధించవచ్చని ఆయన విజయగాథ యువతకు స్ఫూర్తినిస్తోంది. ఆయన మరిన్ని విజయాలు సాధించి దేశానికి, సూర్యాపేట జిల్లాకు మరింత కీర్తి తీసుకురావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. విక్రమ్-1 రాకెట్ విజయవంతం కావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని గంధం లక్ష్మీనాథ్ దిశతో తెలిపారు. ఈ విజయానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్కైరూట్ ఏరోస్పేస్ బృందం అందించిన సహకారం ఎంతో కీలకమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని అంతరిక్ష ప్రాజెక్టుల్లో భాగస్వామిగా నిలిచి దేశానికి సేవ చేయడమే తన లక్ష్యమని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande