
విశాఖపట్నం, 19 జూలై (హి.స.)
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆనందపురం - అనకాపల్లి జాతీయ రహదారిపై గండిగుండం సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు ఘటనా స్థలంలోనే విగతజీవులుగా మారారు. పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన ఒకే కుటుంబం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరగబోయే ఒక శుభకార్యానికి హాజరయ్యేందుకు కారులో బయలుదేరిన క్రమంలో ఈ విషాదం చోటుచేసుకుంది.
బాధితులు ప్రయాణిస్తున్న కారు ఆనందపురం పరిసరాల్లోని గండిగుండం వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా అదుపుతప్పి, ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ప్రమాద సమయంలో కారులో మొత్తం ఐదుగురు ప్రయాణిస్తుండగా.. డ్రైవర్ సహా నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో నరసరాపుపేట ఎమ్మెల్యే పీఏ చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డారు. కాగా, మరణించిన వారిలో చంద్రశేఖర్ కుమారుడు కూడా ఉన్నట్లు సమాచారం.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. తీవ్ర రక్తస్రావమై ప్రాణాపాయ స్థితిలో ఉన్న చంద్రశేఖర్‌ను చికిత్స నిమిత్తం విశాఖపట్నంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. కారు డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందా? లేక మరేదైనా సాంకేతిక లోపం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi