
విశాఖపట్నం, 19 జూలై (హి.స.)
ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతోంది. విశాఖపట్నం సమీపంలోని భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టును లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. దీంతో గత కొంతకాలంగా ప్రారంభోత్సవ తేదీపై నెలకొన్న ఊహాగానాలకు తెరపడింది.
విమానాశ్రయ నిర్మాణ పనుల పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు, ఈ కీలక ప్రకటన చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చరిత్రలో నిలిచిపోయేలా అత్యంత ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఒక చారిత్రక మైలురాయిగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలోని పర్యాటకం, పోర్టులు, జాతీయ రహదారులు, పారిశ్రామిక ప్రగతితో కలిసి ఈ ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్రను 'అన్‌స్టాపబుల్' శక్తిగా మారుస్తుందని ఆయన పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi