
కదిరి, 19 జూలై (హి.స.)రాష్ట్రంలోని విద్యార్థుల ఆరోగ్యకరమైన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాలల్లో అందించే చిక్కీలలో చిరుధాన్యాల (మిల్లెట్స్) ఆధారిత చిక్కీలను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చింతా శరత్ కుమార్ రెడ్డి సత్యసాయి జిల్లా కదిరిలో హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు పోషకాహారాన్ని అందించేందుకు పాఠశాలల్లో చిరుధాన్యాల వినియోగాన్ని ప్రోత్సహించాలని కిసాన్ మోర్చా తరఫున గతంలో అనేక కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రుల సహకారంతో సంతకాల సేకరణ చేపట్టి, పోస్టు కార్డుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు సమర్పించినట్లు పేర్కొన్నారు.
చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, విద్యార్థుల్లో పోషకాహార లోపాలను తగ్గించడంతో పాటు శారీరక, మానసిక వికాసానికి దోహదపడతాయని ఆయన అన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో ఒక కీలకమైన ముందడుగుగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
అదేవిధంగా, పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజన పథకంలో వారానికి కనీసం ఒక రోజు చిరుధాన్యాలతో తయారు చేసిన ఆహారాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. దీని ద్వారా విద్యార్థుల్లో చిరుధాన్యాల పట్ల అవగాహన పెరగడంతో పాటు ఆరోగ్యవంతమైన జీవనశైలికి అలవాటు పడతారని తెలిపారు.
విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ తీసుకున్న ఈ నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV