రిజర్వ్ బ్యాంక్ సంచలన నివేదిక: దేశ ఆర్థిక వ్యవస్థకు ద్రవ్యోల్బణం కంటే పెను ముప్పుగా మారిన 'ఏఐ'!
రిజర్వ్ బ్యాంక్ సంచలన నివేదిక: దేశ ఆర్థిక వ్యవస్థకు ద్రవ్యోల్బణం కంటే పెను ముప్పుగా మారిన 'ఏఐ'!
AI


హైదరాబాద్, 02 జూలై (హి.స.)

దేశ ఆర్థిక వ్యవస్థకు సంప్రదాయ ముప్పులైన ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల కంటే.. వేగంగా విస్తరిస్తున్న 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (కృత్రిమ మేధస్సు) సాంకేతికతే అత్యంత ప్రమాదకరంగా మారిందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) హెచ్చరికలు జారీ చేసింది. ఆర్‌బీఐ తాజాగా విడుదల చేసిన జూన్ 2026 నాటి 'ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్' (ఆర్థిక స్థిరత్వ నివేదిక)లో ఈ కీలక అంశాలను వెల్లడించింది. ఆర్థిక రంగంలో ఏఐ ప్రవేశం వల్ల పనితీరు మెరుగైనప్పటికీ, అదే స్థాయిలో వ్యవస్థ భద్రతకు ఇది ఒక పెద్ద సవాలుగా పరిణమించిందని ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేసింది.

ఏఐ ఆధారిత సైబర్ దాడుల ముప్పు

దేశంలోని ప్రముఖ బ్యాంకులు, ఆర్థిక సంస్థల అభిప్రాయాల ప్రకారం.. రాబోయే 12 నెలల్లో సంభవించే సైబర్ ముప్పులలో 'ఏఐ ఆధారిత సైబర్ దాడులే' అత్యంత ప్రమాదకరమైనవిగా మొదటి స్థానంలో నిలిచాయి. సాధారణ హ్యాకింగ్, రాన్సమ్‌వేర్, ఫిషింగ్ దాడుల కంటే.. ఏఐ సాయంతో సైబర్ నేరగాళ్లు చేసే దాడులు అత్యంత వేగంగా, సమర్థంగా, ఊహించని స్థాయిలో వ్యవస్థలను అతలాకుతలం చేసేలా ఉంటాయని నివేదిక స్పష్టం చేసింది. ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించిన 'మైథోస్ రాన్సమ్‌వేర్' దాడిని ఇందుకు ఉదాహరణగా పేర్కొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande