
ఉత్తరాఖండ్, 20 జూలై (హి.స.)వాతావరణంలో మార్పు కారణంగా ఉత్తరాఖండ్లో చార్ ధామ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. మార్గంలో ఉన్న భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారుల ఆదేశం!
ఉత్తరాఖండ్ లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు రాగల 48 గంటల్లోను భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. దీంతో వాతావరణ పరిస్థితులు క్షీణించడంతో చార్ ధామ్ యాత్ర భక్తుల ముందస్తు రక్ష, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన చార్ ధామ్ యాత్రను (Char Dham Yatra) తాత్కాలికంగా నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. రూట్లు సురక్షితంగా లేకపోవడంతో యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు యంత్రాంగం వెల్లడించింది.
ఈ మేరకు గర్వాల్ కమిషనర్ (Garhwal Commissioner) సంబంధిత జిల్లాల మేజిస్ట్రేట్లు (District Magistrates), ఇతర ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే యాత్ర మార్గంలో ఉన్న భక్తులను తక్షణమే గుర్తించి, వారిని సురక్షిత ప్రాంతాలలో సురక్షితంగా ఉంచాలని, వారికి అవసరమైన వసతి సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశారు. రహదారులు పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని అధికారికంగా ప్రకటించిన తర్వాతే భక్తులను ముందుకు అనుమతించాలని ఆదేశించారు. యాత్రకు సంబంధించిన ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని, ఖచ్చితమైన వివరాలను మీడియా, ఇతర కమ్యూనికేషన్ ఛానెళ్ల ద్వారా భక్తులకు, సాధారణ ప్రజలకు చేరవేయాలని అధికారులకు సూచించారు
--------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV