'డెంగ్యూ' మహమ్మారికి ఎట్టకేలకు చెక్.. తొలి వ్యాక్సిన్కు DCGI అనుమతి
'డెంగ్యూ' మహమ్మారికి ఎట్టకేలకు చెక్.. తొలి వ్యాక్సిన్కు DCGI అనుమతి
Dengue


హైదరాబాద్, 20 జూలై (హి.స.)

దేశంలో ఎక్కువ మంది అనారోగ్యానికి కారణమయ్యే వాటిలో డెంగీ (dengue) ఒకటి. డెంగీ సోకిన వారు కొన్నిసార్లు ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. అంతేకాదు.. దీని చికిత్స కోసం భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే, ఇకపై ఈ ఇబ్బందులు తప్పబోతున్నాయి. ఎందుకంటే దేశంలో డెంగీ సోకకుండా ఉండే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. జపాన్ సంస్థ తయారు చేసిన డెంగీ వ్యాక్సిన్కు కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించింది. దీంతో త్వరలోనే ఈ వ్యాక్సిన్ బహిరంగ మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది.

జపాన్కు చెందిన తకేడా అనే బయోఫార్మా సంస్థ క్యూడెంగా (QDENGA) పేరుతో డెంగీ వ్యాక్సిన్ను దేశంలో అందుబాటులోకి తెచ్చింది. దీనికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతించింది. మార్కెట్లోకి రానున్న ఈ వ్యాక్సిన్ను 4-60 సంవత్సరాల వయసున్న ఎవరైనా తీసుకోవచ్చు. గతంలో డెంగీ సోకినవారైనా, ఇప్పటివరకు డెంగీ సోకకున్నా కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఇప్పటికే కొన్ని డెంగీ వ్యాక్సిన్లు అంతర్జాతీయ మార్కెట్లో ఉన్నాయి. అయితే, అవి తీసుకోవాలంటే ముందుగా ప్రీ వ్యాక్సినేషన్ స్క్రీనింగ్ టెస్టు అవసరం. ఆ టెస్టులో పాసైతేనే వ్యాక్సిన్ తీసుకోవచ్చు. లేదంటే వ్యాక్సిన్ తీసుకోవడం కుదరదు. అయితే, జపాన్ సంస్థ రూపొందించిన క్యూడెంగా వ్యాక్సిన్కు మాత్రం ఇలాంటి టెస్టులు అవసరం లేదు.

ఎవరైనా దీన్ని తీసుకోవచ్చు. ఇది రెండు డోసుల్లో తీసుకోవాలి. ప్రతిసారి 0.5 ఎంఎల్ ఇంజెక్షన్స్ రూపంలో తీసుకోవాలి. మొదటి డోస్ తీసుకున్న మూడు నెలల తర్వాత రెండో డోస్ తీసుకోవాలి. ఈ వ్యాక్సిన్ దేశంలో ఎక్కువగా వ్యాపిస్తున్న నాలుగు రకాల డెంగీ వ్యాధులను నివారించగలదు. ఈ వ్యాక్సిన్ ఇప్పుడు అనేక దేశాల్లో అందుబాటులో ఉంది. ఇందుకోసం 19 దశల పరీక్షలు పూర్తయ్యాయి. వాటిలో ఫేజ్ 1, 2, 3 క్లినికల్ ట్రయల్స్ కూడా ఉన్నాయి. ఇందులో 28,000 మంది పాల్గొన్నారు. ఇండియాతో సహా అనేక దేశాల్లో ఈ వ్యాక్సిన్ పనితీరు, రక్షణ, దుష్ప్రభావాలు వంటి వాటిని పరిశీలించారు. ఏడేళ్లుగా ఈ వ్యాక్సిన్.. డెంగీ నుంచి రక్షిస్తున్నట్లు అధ్యయనం చెబుతోంది.

2022లో ఇది మార్కెట్లోకి రాగా.. 43 దేశాల్లో వినియోగిస్తున్నారు. ఇప్పటివరకు 3.2 కోట్ల డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇండియాలో ఈ వ్యాక్సిన్ ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే దేశంలో డెంగీ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దోమల ద్వారా సంక్రమించే ఈ వ్యాధి ప్రాణాంతకంగా మారే ఛాన్స్ ఉంది. సరైన సమయంలో చికిత్స తీసుకోకుంటే భారీ నష్టం తప్పదు. అందుకే ఈ వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే డెంగీ వ్యాధి బాధితుల సంఖ్య తగ్గుతుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande