
హైదరాబాద్, 20 ఆగస్టు (హి.స.)
అబ్దుల్లాపూర్ మెట్ జాతీయ రహదారిపై పాలిటెక్నిక్ విద్యార్థులు భారీగా రాస్తారోకో నిర్వహించారు. జీవో నంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. విద్యార్థుల ఆందోళనను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పోలీసులు లాఠీచార్జి చేయగా పలువురు విద్యార్థులకు గాయాలైనట్లు సమాచారం. ఆందోళనలో పాల్గొన్న కొంతమంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే జీవో నంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే విద్యార్థుల పక్షాన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎస్ఎఫ్ఎ నాయకులు గుండే శివకుమార్, శశితో పాటు విద్యార్థులు పునీత్, గౌస్, జస్వంత్ తదితరులు ఆందోళనలో పాల్గొని ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు