బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో రెండ్రోజులు అతిభారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో రెండ్రోజులు అతిభారీ వర్షాలు
Drizzling rain in Ahmedabad,


హైదరాబాద్, 24 ఆగస్టు (హి.స.)

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు మళ్లీ ఊపందుకున్నాయి. రానున్న రెండు రోజుల పాటు (ఆగస్టు 24, 25 తేదీల్లో) రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

వాతావరణ శాఖ సూచన ప్రకారం, సోమవారం కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసి, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.

ఇవి కాకుండా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ సహా రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. వర్షం సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

హైదరాబాద్ నగరం, దాని పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 30 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదులు, వాగుల సమీపంలో నివసించే వారు మరింత జాగ్రత్తగా ఉండాలని, అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande