
అమరావతి, 21 ఆగస్టు (హి.స.)
మెగా డీఎస్సీ-2025పై చర్చించాలని శాసన మండలిలో వైసీపీ సభ్యులు వరుసగా నాలుగో రోజైన గురువారం ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు డీఎస్సీపై చర్చించాలని పట్టుబట్టారు. నల్ల కండువాలు ధరించి సభకు వచ్చిన వైసీపీ సభ్యులు చైర్మన్ పోడియం వద్ద నిరసన తెలిపారు. ప్రశ్నోత్తరాలు, ప్రభుత్వ బిల్లులు ప్రవేశపెట్టే సమయంలోనూ టేబుల్ను చరుస్తూ, ప్లకార్డులను చైర్మన్ ముఖానికి అడ్డుగా పెట్టి, చైర్మన్ చెవి దగ్గరగా.. పెద్దగా నినాదాలు ఇచ్చారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ నినాదాలు హోరెత్తించారు. సభ్యులు పోడియం దిగి, తమ స్థానాల్లో కూర్చోవాలని చైర్మన్ పదేపదే చెప్పినా.. ఆందోళన కొనసాగించారు. దీంతో కొంతసేపు సభను వాయిదా వేయగా, విపక్ష సభ్యులు పోడియం ముందు బైఠాయించి నినాదాలు చేశారు. సభ తిరిగి ప్రారంభమయ్యాక, ఎమ్మెల్సీగా రమాదేవి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ప్రభుత్వ బిల్లులను ప్రవేశపెట్టడానికి చైర్మన్ అనుమతివ్వగా, మంత్రులు బిల్లులను ప్రవేశపెడుతుండగానే వైసీపీ సభ్యులు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ, పోడియంను చుట్టుముట్టారు. దీంతో సభను వాయిదా వేశారు. ఆ తర్వాత మంత్రులు బిల్లులను ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో ఆమోదం పొందిన12 బిల్లులకు మండలిలోనూ ఆమోదం లభించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ