
ఆసిఫాబాద్, 21 ఆగస్టు (హి.స.)
కాగజ్నగర్ పట్టణంలోని రామ్ మందిర్ ప్రాంతంలో కూరగాయలు అమ్ముకునే రైతులు, వ్యాపారులపై మున్సిపల్ అధికారులు ప్రదర్శిస్తున్న వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. దశాబ్దాలుగా అదే స్థలంలో వ్యాపారం చేసుకొని పొట్టకూటిని వెళ్లదీస్తున్న తమను, ప్రత్యామ్నాయం చూపకుండా అడ్డుకోవడంపై ఆగ్రహించిన రైతులు, శుక్రవారం కూరగాయలను రోడ్డుపై పడేసి వినూత్న రీతిలో ధర్నా చేపట్టారు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని రామ్ మందిర్ వద్ద రాకపోకలకు ఆటంకం కలుగుతోందనే నెపంతో అక్కడ కూరగాయల విక్రయాలను మున్సిపల్ యంత్రాంగం నిషేధించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయాన్నే పోలీసులు, మున్సిపల్ సిబ్బంది ఏకమై భారీ బందోబస్తు మధ్య వ్యాపారులను అక్కడి నుంచి ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు. అధికారులు కేటాయించిన స్థలంలో కనీస వసతులు లేకపోవడమే కాకుండా, అక్కడ విక్రయాలు సాగించడం సాధ్యం కాదని రైతులు తేల్చిచెప్పారు.
పొట్టకూటి కోసం రోడ్డుపక్కన వ్యాపారం చేసుకునే పేద రైతుల పట్ల మున్సిపల్ కమిషనర్ కఠినంగా వ్యవహరిస్తున్నారని నిరసనకారులు మండిపడ్డారు. మున్సిపల్ కమిషనర్ డౌన్ డౌన్ అంటూ పెద్దెత్తున నినాదాలు చేస్తూ తమ వద్ద ఉన్న కూరగాయలను రోడ్డుపై చెల్లాచెదురుగా పడేసి నిరసన తెలియజేశారు. మున్సిపల్ కమిషనర్ నేరుగా ఘటనా స్థలానికి వచ్చి తమ సమస్య వినాలని, వ్యాపారానికి అనుకూలమైన సరైన స్థలాన్ని కేటాయించే వరకు నిరసన విరమించేది లేదని రైతులు స్పష్టం చేశారు. ఈ ధర్నాతో రామ్ మందిర్ ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు స్తంభించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..