కేబినెట్, పార్టీ నుంచి సురేఖను తొలగించాల్సిందే: సీఎల్పీ వేదికగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఫైర్
కేబినెట్, పార్టీ నుంచి సురేఖను తొలగించాల్సిందే: సీఎల్పీ వేదికగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఫైర్
Konda Surekha


హైదరాబాద్, 21 ఆగస్టు (హి.స.)

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ (Konda Surekha) ఆమె కుమార్తె కొండా సుస్మిత (Konda Sushmita) వివాదం తీవ్రరూపం దాల్చింది. సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీని లక్ష్యంగా చేసుకుని సుస్మిత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శాసనసభాపక్ష (CLP) వేదికగా 20 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అత్యవసర ప్రెస్ మీట్ నిర్వహించారు. కొండా సురేఖను వెంటనే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో పాటు, పార్టీ నుండి కూడా డిస్మిస్ చేయాలని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తరఫున ప్రభుత్వ చీఫ్ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. కుమార్తె సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను మంత్రి సురేఖ ఇప్పటివరకు ఖండించకపోవడాన్ని మేమంతా తీవ్రంగా తప్పుబడుతున్నాం. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ కూతురి వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదనడం అత్యంత విడ్డూరం. పార్టీలో ఏవైనా అభిప్రాయభేదాలు ఉంటే సీఎల్పీ లేదా పీసీసీ సమావేశాల్లో మాట్లాడాలి తప్ప, ముఖ్యమంత్రిని, పార్టీని ఉద్దేశించి బహిరంగంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం ఏమాత్రం సరికాదు అని స్పష్టం చేశారు.

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. కొండా సురేఖ వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఎవరు తప్పుడు ఆరోపణలు చేసినా అధిష్టానం కఠిన చర్యలు తీసుకోవాలి. పార్టీలోనే ఉంటూ సీఎం నిర్ణయాలను తప్పుబట్టడం అంటే, ఉన్న చెట్టు కొమ్మను తామే నరుక్కున్నట్లే. ఈ తల్లీకూతుళ్ల వ్యాఖ్యలను ఖండించకపోతే ప్రతిపక్షాలకు బలం చేకూర్చినట్లవుతుంది. గతంలో కూడా కొండా సురేఖ నోరుజారి పార్టీకి తలవంపులు తెచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు రాత్రింబవళ్లు కష్టపడ్డారు. సీఎంకు కొండా కుటుంబం వెంటనే క్షమాపణ చెప్పాలి. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి, పార్టీ నుంచి డిస్మిస్ చేయాల్సిందే అని డిమాండ్ చేశారు.

దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత చేసిన విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నాం. విపక్షాల కుట్రలను కొండా కుటుంబం కాంగ్రెస్లో ఉంటూ అమలు చేస్తోంది. తెలంగాణలో ప్రజాపాలన సాగుతుంటే, కొండా సురేఖ మాత్రం ప్రతిపక్ష నేతలా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రిని వ్యతిరేకించే వారికి కాంగ్రెస్ పార్టీలో కొనసాగే అర్హత ఎంతమాత్రం లేదు. పార్టీ అధిష్ఠానం సురేఖపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి అని స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande