
నాగార్జునసాగర్, 21 ఆగస్టు (హి.స.)
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువకు వస్తున్న నీటితో నాగార్జునసాగర్ జలాశయంలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 9 గంటల వరకు జలాశయంలో నీటి మట్టం 531.70 అడుగులకు చేరగా, నీటి నిల్వ 171.4844 టీఎంసీలకు చేరుకుంది. జలాశయానికి 55,278 క్యూసెక్కుల భారీ ఇనో కొనసాగుతోంది. ప్రస్తుతం నాగార్జునసాగర్ క్రెస్ట్ గేట్లు మూసి ఉండగా, ప్రధాన విద్యుత్ కేంద్రం, కుడి-ఎడమ కాలువలకు నీటి విడుదల లేదు. SLBC (AMRP) ద్వారా 500 క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారు. మొత్తం ఔట్లో 500 క్యూసెక్కులుగా నమోదైంది. అయితే సాగర్ ఆయకట్టు రైతుల్లో మాత్రం సాగునీటి విడుదలపై అయోమయం కొనసాగుతోంది. జలాశయంలోకి భారీగా వరద నీరు చేరుతున్నప్పటికీ, సాగర్ ఆయకట్టు పరిధిలోని పంటలకు సాగునీరు ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంలో అధికారులు ఇప్పటివరకు స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సాగు కీలక దశలో ఉండటంతో పంటలకు సకాలంలో నీరు అందకపోతే నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జలాశయంలో నీటి నిల్వలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో సాగర్ ఆయకట్టుకు సాగునీటి విడుదలపై ప్రభుత్వం, నీటిపారుదల అధికారులు వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని రైతులు కోరుతున్నారు. ఒకవైపు నాగార్జునసాగర్లో నీటి మట్టం పెరుగుతుండటం, మరోవైపు తమ పంటలకు సాగునీరు ఎప్పుడు అందుతుందో తెలియకపోవడంతో సాగర్ ఆయకట్టు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సాగునీటి విడుదలపై స్పష్టత కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..