
అమరావతి, 21 ఆగస్టు (హి.స.)
స్థానిక సంస్థల పాలనలో పారదర్శకతను పెంచేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరపాలక సంస్థల మేయర్లు, మున్సిపాలిటీల ఛైర్మన్లను ప్రజలే నేరుగా ఎన్నుకునేలా (Direct Election) చట్ట సవరణ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. 'ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ లాస్ (నాల్గవ సవరణ) బిల్లు-2026' ద్వారా 1955 మరియు 1965 నాటి పాత మున్సిపల్ చట్టాలను సవరించారు. దీని ప్రకారం మేయర్, ఛైర్మన్ పదవుల కాలపరిమితి ఐదేళ్లు ఉంటుంది.
గతంలో కౌన్సిలర్లు లేదా కార్పొరేటర్ల ద్వారా పరోక్ష పద్ధతిలో మేయర్లను ఎన్నుకునే విధానం ఉండేది. దీనివల్ల క్యాంప్ రాజకీయాలు, అక్రమాలకు తావుండేదని, ప్రజల మద్దతు ఉన్నవారే నేరుగా పీఠం ఎక్కేలా ఈ కొత్త విధానాన్ని తెచ్చామని మున్సిపల్ శాఖ మంత్రి తెలిపారు. దీనివల్ల నగరాలు, పట్టణాల అభివృద్ధిపై మేయర్లు పూర్తి స్థాయి బాధ్యతతో దృష్టి పెట్టే అవకాశం లభిస్తుంది. మున్సిపల్ ఎన్నికలు త్వరలోనే రానున్న నేపథ్యంలో ఈ చట్ట సవరణ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాజకీయ విశ్లేషకులు స్వాగతిస్తున్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi