
హైదరాబాద్, 21 ఆగస్టు (హి.స.)
హైదరాబాద్ మహానగర పరిధిలోని రాయదుర్గం పాన్మక్తా వద్ద గల ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియలో జోక్యం చేసుకునేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ వివాదానికి సంబంధించిన ఏ అంశమైనా సరే ముందుగా హైకోర్టులోనే తేల్చుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, రాయదుర్గం పాన్మక్తా పరిధిలోని సుమారు 11 ఎకరాల అత్యంత విలువైన భూములను విక్రయించేందుకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) వేలం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా ఒక్కో ఎకరాకు కనీస ధరగా (Upset Price) 5.175 కోట్లను నిర్ణయించింది.ఈ క్రమంలో TGIIC జారీ చేసిన ఈ వేలం నోటిఫికేషన్ ను సవాలు చేస్తూ జువ్వాడి ప్రణయ్ సింహారావు (Juvvadi Pranay Simharao) సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం, నోటిఫికేషన్ ప్రక్రియలో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. ఈ వ్యవహారంపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలంగాణ హైకోర్టుకు వెళ్లాలని సూచిస్తూ పిటిషన్ను తోసిపుచ్చింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు