
అమరావతి, 21 ఆగస్టు (హి.స.)
ఆంధ్రప్రదేశ్ శాసనసభ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సమూలంగా మార్చే నాలుగు కీలక ఉన్నత విద్యా సవరణ బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించింది. మానవ వనరుల అభివృద్ధి మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. ఈ కొత్త చట్టాల ప్రకారం రాష్ట్రంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన భూమి నిబంధనలను భారీగా సడలించారు. తద్వారా అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలు ఏపీకి వచ్చేందుకు మార్గం సుగమం కానుంది.
గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ అధికారాలను కేవలం ఫీజుల నియంత్రణకు మాత్రమే పరిమితం చేస్తూ సవరణలు చేశారు. ఇదివరకు ఈ కమిషన్ సమాంతర వ్యవస్థలా మారి విద్యా సంస్థలను వేధించిందని నారా లోకేష్ విమర్శించారు. ఇకపై విద్యా ప్రమాణాల పర్యవేక్షణ అంతా నేరుగా ఉన్నత విద్యా కమీషనర్ చేతుల్లోనే ఉంటుంది. అలాగే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియను మరింత పారదర్శకం చేసేలా నిబంధనలను సవరించారు. రాష్ట్ర యువతకు నైపుణ్య ఆధారిత విద్యను అందించి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడమే ఈ బిల్లుల ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi