మార్గదర్శి కేసులో ఉండవల్లి పిటిషన్ కొట్టివేత: ఇరవై ఏళ్ల న్యాయపోరాటానికి సుప్రీంకోర్టులో తెర
మార్గదర్శి కేసులో ఉండవల్లి పిటిషన్ కొట్టివేత: ఇరవై ఏళ్ల న్యాయపోరాటానికి సుప్రీంకోర్టులో తెర
Supreme Court


హైదరాబాద్, 21 ఆగస్టు (హి.స.)

గత రెండు దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లో అమితాసక్తి రేపిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ వివాదానికి సుప్రీంకోర్టులో ఇవాళ శాశ్వత ముగింపు లభించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ సంస్థ అక్రమాలకు పాల్పడిందంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు పూర్తిగా కొట్టివేసింది. దీంతో 20 ఏళ్ల సుదీర్ఘ చట్టపరమైన పోరాటంలో మార్గదర్శి సంస్థకు క్లీన్ చిట్ లభించినట్లయింది. ఖాతాదారుల సొమ్ముకు ఎటువంటి ఢోకా లేదని, చట్ట నిబంధనలకు లోబడే సంస్థ నడుస్తోందని గతంలోనే యాజమాన్యం వాదించింది.

సుప్రీంకోర్టు ఈ కేసులో ఇరుపక్షాల సుదీర్ఘ వాదనలను ఆలకించిన అనంతరం, పిటిషనర్ సమర్పించిన ఆధారాలు కేసు కొనసాగింపునకు తగినంతగా లేవని అభిప్రాయపడింది. ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ తీర్పుపై స్పందిస్తూ, తాను ప్రజల సొమ్ము రక్షణ కోసమే ఇన్నేళ్లుగా న్యాయపోరాటం చేశానని, కోర్టు తీర్పును గౌరవిస్తానని పేర్కొన్నారు. కాగా, రామోజీ గ్రూప్ సంస్థల ప్రతినిధులు ఈ తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. నిజాయితీకి, చట్టబద్ధతకు ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని ఈ తీర్పు ద్వారా నిరూపితమైందని వారు వ్యాఖ్యానించారు. ఈ చారిత్రాత్మక తీర్పుతో మార్గదర్శిపై ఉన్న అన్ని చట్టపరమైన చిక్కులు తొలగిపోయినట్లయింది

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande