వెలిగొండ నిర్వాసితులకు మరో విడత పరిహారాన్ని అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
వెలిగొండ నిర్వాసితులకు మరో విడత పరిహారాన్ని అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
Chandrababu Naidu(file)


అమరావతి, 22 ఆగస్టు (హి.స.)

వెలిగొండ నిర్వాసితులకు మరో విడత పరిహారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించారు. మూడో విడతగా రూ.250 కోట్ల పరిహారం చెక్కును నిర్వాసితులకు సీఎం అందజేశారు. దీంతో ఇప్పటి వరకూ రూ.768 కోట్లను నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం ఇచ్చింది. మొదటి విడతలో 2,557 కుటుంబాలకు రూ.318 కోట్లు, రెండో విడతలో 1,622 కుటుంబాలకు రూ.200 కోట్లు చెల్లించింది. మూడో విడతగా ఈరోజు(శనివారం) 2,027 కుటుంబాలకు రూ.250 కోట్ల పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. ఇప్పటి వరకూ మొత్తం 6,206 కుటుంబాలకు రూ.768 కోట్ల మేర పరిహారాన్ని ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. దీంతో దాదాపు 85 శాతం మేర ఆర్ అండ్ ఆర్ పూర్తి అయ్యింది.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఈనెల 31 తేదీన వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను ప్రారంభిస్తామని చెప్పారు. అసాధ్యమనుకున్న 30 ఏళ్ల వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని సుసాధ్యమని చేసి చూపించామన్నారు. 1996లో శిలాఫలకం వేసి 2026లో ప్రాజెక్టును ప్రారంభించుకుంటున్నామని తెలిపారు. సీఎంగా 1995లో ఆ ప్రాంతానికి వెళ్లినప్పుడు రైతులు సాగు, తాగునీరు ఇవ్వాలని కోరారని.. అందుకే ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఇప్పుడు ప్రారంభించేలా రెండేళ్లలో రూ.2,250 కోట్లు ఖర్చు చేశామన్నారు. నాడు ఎన్టీఆర్ వేసిన వివిధ ప్రాజెక్టుల ఫౌండేషన్లను పూర్తి చేసి ప్రారంభించటం తన అదృష్టమని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ఎల్నినో కారణంగా 50 శాతం లోటు వర్షపాతం ఉందని... శ్రీశైలం, నాగార్జునసాగర్లకు నీళ్లు రాలేదని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టును పూర్తి చేసి నీరు ఇవ్వాలని సంకల్పించుకున్నామన్నారు. 2019లో అధికారంలోకి వచ్చి ఉంటే 2021లోనే పూర్తి చేసేవాళ్లమని... అయినా గత పాలకులు చేసిన డ్రామాలతో ప్రాజెక్టు సాధ్యం కాలేదని విమర్శించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande