
హుస్నాబాద్, 22 ఆగస్టు (హి.స.)
తెలంగాణ సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. 'పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజా పాలన' కార్యక్రమంలో భాగంగా అక్కన్నపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షిస్తున్న 'వికసిత్ భారత్' లక్ష్యం నెరవేరాలంటే అన్ని రాష్ట్రాల అభివృద్ధి అవసరమని, అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం 'తెలంగాణ రైజింగ్ 2047' ప్రణాళికతో ముందుకెళ్తాందని చెప్పారు. రాష్ట్రానికి పెట్టుబడులు తేవడానికి, అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ సామర్థ్యాన్ని చాటడానికి ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలు చేపట్టాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం అనుమతులు నిరాకరించడం బాధాకరమని, ఇది కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి రావాల్సిన మెట్రో రైలు, ఔటర్ రింగ్ రోడ్డు, నిధులు, ప్రాజెక్టులను తీసుకురావడంలో రాష్ట్ర బీజేపీ నాయకులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం బీజేపీ నేతలకు లేదా ? అని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు తమ ఐక్యతను కేంద్రం నుంచి తెలంగాణకు నిధులు, ప్రాజెక్టులు సాధించడంలో చూపించాలని హితవు పలికారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని 183 గ్రామాల్లో ప్రజాసమస్యలను నేరుగా తెలుసుకొని, అక్కడికక్కడే పరిష్కరించేందుకే 'పల్లె పల్లెకు ప్రజా పాలన' కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. ప్రతిరోజూ 5 నుంచి 6 గ్రామాల్లో పర్యటిస్తూ వ్యవసాయం, ఉపాధి, విద్యుత్, రోడ్లు, తాగునీరు, పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్లు వంటి అంశాలపై ప్రజల అభిప్రాయాలు స్వీకరిస్తున్నామని, అధికారులతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు