
గుంతకల్లు , 22 ఆగస్టు (హి.స.)అనంతపురం జిల్లా గుంతకల్లు విద్యార్థిని అనీష్ ఫాతిమా అరుదైన ఘనత.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో విద్య అభ్యసించేందుకు భారతదేశం నుంచి 2025-26 విద్యా సంవత్సరంలో ఎంపికైన ఏకైక యువతిగా గుర్తింపు పొందింది.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించడం ప్రతిభావంతులైన విద్యార్థులకు ఒక కల లాంటిది. అందులో సీటు సాధించడం అంటే సామాన్యమైన విషయం కాదు. అంతటి ప్రఖ్యాతి గాంచిన యూనివర్సిటీలో అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన శాన్వాజ్ బేగం, జాకీర్ హుస్సేన్ ల కుమార్తె ఫాతిమా అనే విద్యార్థిని అర్హత సాధించింది. 2025-26 విద్యా సంవత్సరంలో నిర్వహించిన పరీక్షలలో మొత్తం 120 దేశాల విద్యార్థులు పాల్గొనగా… భారతదేశం నుండి అర్హత సాధించిన ఏకైక విద్యార్థినిగా ఫాతిమ నిలిచింది.
ఆంధ్రప్రదేశ్ నుంచి తనకు దక్కిన ఇటువంటి అరుదైన గౌరవం చాలా సంతోషాన్ని కలిగించిందని ఫాతిమా ఆనందం వ్యక్తం చేస్తుంది . పదవ తరగతి వరకు కేంద్రీయ విద్యాలయంలో విద్యనభ్యసించిన ఫాతిమా ఇంటర్మీడియట్ చదువు కోసం రిషి వ్యాలీ పాఠశాలకు వెళ్ళింది. ఎనిమిదవ తరగతి నుండి ఎలాగైనా ఉన్నత విద్యను ప్రఖ్యాత విద్యా సంస్థలలో విద్యను అభ్యసించాలన్న కోరికతో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నాలుగు సంవత్సరాలకు ఒకసారి అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షలలో పాల్గొని అర్హత సాధించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV