మల్లారెడ్డి కాలేజీపై కేసు నమోదు.. 'టాక్సిక్' ఈవెంట్లో భద్రతా చర్యల నిర్లక్ష్యం.
మల్లారెడ్డి కాలేజీపై కేసు నమోదు.. 'టాక్సిక్' ఈవెంట్లో భద్రతా చర్యల నిర్లక్ష్యం.
Malla Reddy College


హైదరాబాద్, 23 ఆగస్టు (హి.స.)

హైదరాబాద్లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో శనివారం రాత్రి నిర్వహించిన కన్నడ స్టార్ హీరో యశ్ 'టాక్సిక్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో తీవ్ర అపశృతి చోటుచేసుకుంది. కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో యూనివర్సిటీ యాజమాన్యం, ఈవెంట్ మేనేజర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున అభిమానులు, విద్యార్థులు హాజరయ్యారు. వేదిక సమీపంలో క్రౌడ్ విపరీతంగా పెరగడంతో కొంతమంది యువకులు క్లియర్ వ్యూ కోసం ఫ్లడ్ లైట్ స్తంభాలు, భారీ సౌండ్ బాక్సులకు అమర్చిన ఐరన్ పోల్స్పైకి ఎక్కారు. ఈ క్రమంలో బరువు ఎక్కువై భారీ సౌండ్ బాక్స్ అమర్చిన ఒక పోల్ ఉన్నపళంగా కిందపడిపోయింది.

ఈ ప్రమాదం జరిగే సమయంలో హీరో యశ్ వేదికపై మాట్లాడుతున్నారు. అకస్మాత్తుగా పోల్ పడిపోవడాన్ని గమనించిన ఆయన వెంటనే ప్రసంగాన్ని ఆపేసి కంగారుగా స్పందించారు. అక్కడ అందరూ సురక్షితంగానే ఉన్నారా? ఏమైందో చూడండి అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. మిగతా లైటింగ్ స్టాండ్లు, మైక్ పోల్స్ ఎక్కిన యువకులను వెంటనే కిందకు దిగాలని వేదికపై నుంచే కోరారు. ఈ దుర్ఘటనలో గాయపడిన ఇద్దరు యువకులను పోలీసులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వేలాది మంది వచ్చే ఈవెంట్లో భద్రత, గుంపు నియంత్రణ నిబంధనలు పాటించనందుకే ఈ ప్రమాదం జరిగిందని భావించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande