సీపీఎస్ రద్దు.. పాత పెన్షన్ పునరుద్ధరణకు ఛలో హైదరాబాద్
సీపీఎస్ రద్దు.. పాత పెన్షన్ పునరుద్ధరణకు ఛలో హైదరాబాద్
Teacher


భద్రాద్రి కొత్తగూడెం, 23 ఆగస్టు (హి.స.)

సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనే ఏకైక డిమాండ్తో భద్రాద్రి జిల్లా పాల్వంచ నుంచి సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆదివారం భారీగా హైదరాబాద్కు తరలివెళ్లారు. తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్సీపీఎస్ఈయూ) భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు తుక్కాని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో రెండు బస్సులతో పాటు కార్లలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులు ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి బయలుదేరారు.హైదరాబాద్లోని లాల్బహదూర్ స్టేడియంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు వేలాదిగా సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు హాజరవుతున్నారని సంఘం నాయకులు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేసి సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు తుక్కాని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 2.60 లక్షల మంది ఉద్యోగులు సీపీఎస్ విధానంలో ఉన్నారని తెలిపారు. 25 నుంచి 30 ఏళ్లపాటు ప్రభుత్వానికి, ప్రజలకు సేవలందించిన ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం భద్రత కల్పించే పాత పెన్షన్ లేకపోవడం ఆందోళనకరమన్నారు.

ఉద్యోగుల భవిష్యత్తో ముడిపడిన ఈ సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు.2023 సాధారణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఆ హామీని మేనిఫెస్టోలోనూ పొందుపరిచినప్పటికీ ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు నిర్ణయం తీసుకోకపోవడంతో సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు.హామీ అమలు కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడంలో భాగంగా జూలై 11న భద్రాచలం నుంచి జనజాగరణ, బస్సు యాత్రను ప్రారంభించి 33 జిల్లాల మీదుగా 42 రోజులపాటు కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ యాత్రలో సుమారు 100 మంది ఎమ్మెల్యేలు, మంత్రులను కలిసి సీపీఎస్ రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని వినతిపత్రాలు అందజేసినట్లు చెప్పారు. జనజాగరణ యాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్లో లక్ష మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు శ్రీనివాసరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు కేవలం మాటలకే పరిమితం కాకూడదు. ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుని సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. ఉద్యోగుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలి అని తుక్కాని శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande