
విశాఖపట్నం, 23 ఆగస్టు (హి.స.)
విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుండి ఈరోజు ఉదయం వేటకు బయలుదేరిన మత్స్యకారులకు సముద్రంలో ఒక పెద్ద ప్రమాదం తప్పింది. హార్బర్ నుండి సుమారు 2.8 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించిన తర్వాత, సముద్ర గర్భంలో ఉన్న ఒక భారీ రాయిని (మత్స్యకారుల పరిభాషలో కొండ) వీరి మెకనైజ్డ్ బోటు బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన దాటికి బోటులోకి నీరు చేరడంతో అది క్రమంగా సముద్రంలో మునిగిపోయింది. అయితే, ప్రమాదాన్ని ముందే గమనించిన బోటులోని ఐదుగురు మత్స్యకారులు అప్రమత్తమై సముద్రంలోకి దూకారు. ఆ సమయంలో సమీపంలోనే వేట సాగిస్తున్న మరో మత్స్యకార పడవ సిబ్బంది వీరిని గమనించి, తక్షణమే రక్షించి సురక్షితంగా ఒడ్డుకు చేర్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi