రేవంత్ రెడ్డి.. ఇదేనా మీరు చెప్పే అంతర్జాతీయ ప్రమాణాలు: హరీశ్ రావు
రేవంత్ రెడ్డి.. ఇదేనా మీరు చెప్పే అంతర్జాతీయ ప్రమాణాలు: హరీశ్ రావు
Harish Rao


హైదరాబాద్, 23 ఆగస్టు (హి.స.)

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన యూనిఫారాలు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని హరీశ్ రావు విమర్శించారు. రాష్ట్రంలో విద్యార్థులకు అందజేసిన స్కూల్ యూనిఫారాలు అప్పుడే చినిగిపోవడం, మరి కొన్ని చోట్ల సరైన కొలతలు లేకుండా అందజేయడం పట్ల హరీశ్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. మాట్లాడితే ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థ అనే మీరు.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కనీసం నాణ్యమైన యూనిఫారాలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారా? ఇదేనా మీరు చెప్పే అంతర్జాతీయ ప్రమాణాలు రేవంత్ రెడ్డి? అని నిలదీశారు.

రాష్ట్రంలో ఒకచోట యూనిఫారాలు అందలేదు.. అందినచోట కొలతలు సరిగ్గా లేవు. కుట్లు ఊడిపోతున్నాయి.. ఉతికితే రంగులు వెలిసిపోతున్నాయి. రెండు జతలు ఇవ్వాల్సి ఉండగా, చాలా చోట్ల ఒక్క జత కూడా పూర్తిగా అందలేదని హరీశ్ రావు ఆరోపించారు. రేవంత్ రెడ్డికి గుజరాత్ దళారులపై ఉన్న ప్రేమ.. తెలంగాణ చేనేత కార్మికులపై లేదని చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేలా స్థానికంగా యూనిఫారాల తయారీకి ప్రాధాన్యత ఇవ్వాల్సింది పోయి.. కమీషన్ల కోసం బడా కార్పొరేట్ల నుంచి నాసిరకం యూనిఫారాలు తెప్పించి విద్యార్థులకు, చేనేత కార్మికులకు అన్యాయం చేశారని విమర్శించారు.

మఫత్లాల్ ముద్దు.. చేనేత వద్దు అన్నదే ప్రభుత్వ వైఖరిగా మారిందా? అని హరీశ్ రావు నిలదీశారు. ఒకవైపు చేనేత కార్మికుల ఉపాధికి గండి.. మరోవైపు విద్యార్థులకు నాసిరకం యూనిఫారాలు.. దీంతో విద్యార్థులకు కష్టం.. చేనేత కార్మికులకు ఉపాధి నష్టం అన్నారు. నాసీరకం యూనిఫామ్లపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande