నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం కీలకం:రామగుండం పోలీస్ కమిషనర్
నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం కీలకం:రామగుండం పోలీస్ కమిషనర్
Cp


గోదావరిఖని, 23 ఆగస్టు (హి.స.)

ప్రజలు ఎలాంటి భయం లేకుండా ప్రశాంత వాతావరణంలో జీవించేలా భరోసా కల్పించడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని, పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెంచికల్పేట్ గ్రామంలో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ మడత రమేష్, టూ టౌన్ ఇన్స్పెక్టర్లు ప్రసాద్ రావు, లింగమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు గ్రామంలోని అనుమానాస్పద ప్రాంతాలు, నివాస గృహాల్లో తనిఖీలు నిర్వహించారు. గంజాయి అక్రమ రవాణా, నిల్వ, సరఫరాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 70 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. నేరాల నియంత్రణకు ప్రజలే కీలకమన్నారు. ప్రజల భద్రత కోసం పెట్రోలింగ్ వాహనాలు, బ్లూ కోల్ట్స్ పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తున్నామని తెలిపారు. నేరాలను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు ప్రజల సహకారం తప్పనిసరి అన్నారు. గ్రామంలో లేదా తమ ప్రాంతంలో కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కుటుంబ సభ్యులు, బంధువులు లేదా పరిచయస్తులు ఎవరైనా నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిసినా దాచి పెట్టకుండా పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. నేరాన్ని ప్రారంభ దశలోనే అడ్డుకుంటే భవిష్యత్తులో ఎదురయ్యే పెద్ద సమస్యలను నివారించవచ్చన్నారు. ప్రస్తుతం నేరాల స్వభావంలో మార్పులు వస్తున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య

వివాదాలు, నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు, పిల్లల మధ్య పరస్పర అవగాహన పెంచుకోవాలని సూచించారు. కుటుంబ సమస్యలను పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకునేలా పెద్దలు చొరవ చూపాలన్నారు.

యువత చెడు మార్గాలకు దూరంగా ఉండి చదువు, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి పై దృష్టి పెట్టాలని సీపీ పిలుపునిచ్చారు. తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకుని కష్టపడి పనిచేస్తే విజయాన్ని సాధించ వచ్చన్నారు. యువతకు ఉద్యోగ సాధన, నైపుణ్య శిక్షణలో పోలీసుల తరఫున సాధ్యమైనంత సహకారం అందిస్తామని తెలిపారు. అవసరమైతే ఇతర ప్రభుత్వ శాఖల సహకారంతో శిక్షణ, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. సింగరేణి సంస్థలో అందుబాటులో ఉన్న అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పని లేకుండా చెడు మార్గాల్లోకి వెళ్లడం వల్ల కుటుంబాలతో పాటు సమాజానికి, ప్రభుత్వ యంత్రాంగానికి ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే డయల్-112కు కాల్ చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని ప్రజలకు సీపీ సూచించారు. చట్టాన్ని గౌరవిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు ప్రసాద్ రావు, లింగమూర్తి, వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ఘాలొద్దీన్, కమాన్పూర్ ఎస్ఐ ప్రసాద్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande